ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:19:22

దొంగలు ఎస్కేప్‌.. బంగారం సేఫ్‌

దొంగలు ఎస్కేప్‌..  బంగారం సేఫ్‌
  • సీసీ కెమెరాల కండ్లు మూసేసినా యజమాని అప్రమత్తం
  • డయల్‌100కు ఫోన్‌ కొట్టగానే నిమిషాల్లో స్పాట్‌కు పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని ఒక కార్యాలయంలో భారీ దోపిడీకి దుండగులు స్కెచ్‌వేశారు. అంతా సిద్ధంచేసుకొని రంగంలోకి దిగా రు. మరో పదినిమిషాలైతే రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని లూటీ చేసేవారు. కానీ అప్పటికే చేపట్టిన ముందుజాగ్రత్తలు ఆ కార్యాలయ యజమానిని అప్రమత్తం చేశాయి. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌చేయగానే నిమిషాల్లో పోలీసులు చేరుకున్నారు. దీంతో దొంగలు ఎస్కేప్‌.. బంగారం సేఫ్‌. ఈ ఘటన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాలానగర్‌ జోన్‌లో ఇటీవల జరిగింది. వివరాల్లోకెళ్తే.. కొంపల్లిలోని ‘మణప్పురం’ శాఖలో దోపిడీకి పథకం వేసుకొన్న దొంగ లు కొద్దిరోజుల క్రితం ఆ కార్యాలయానికి ఆనుకొని ఉన్న మడిగిలో అద్దెకు దిగారు. ఈ నెల 11వ తేదీ రాత్రి ప్లాన్‌ను అమలుచేసేందుకు సీసీ కెమెరాల కనెక్షన్లను కట్‌చేశారు. అనంతరం కార్యాలయం గోడకు రంధ్రం చేశారు. సీసీ కెమెరాలను కార్యాలయ యజమాని తన ఫోన్‌కు అనుసంధానం చేసుకొన్నారు. 11 అర్ధరాత్రి  తర్వాత ఫోన్‌లో సీసీ కెమెరాలను చూసేందుకు ప్రయత్నించగా.. అవి పనిచేయడంలేదని తేలింది. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. దీన్ని గ్రహించి దుండగులు పరారవడంతో రూ.13 కోట్ల విలువచేసే 30 కిలోల బంగారం సురక్షితంగా మిగిలింది. దుండగులను పట్టుకొనేందుకు పోలీ సులు బృందాలుగా రంగంలోకి దిగారు. ప్రాథమిక ఆధారాలతో క్రైం రీకన్‌స్ట్రక్షన్‌ కోసం మ్యాపింగ్‌వేసి వేట మొదలుపెట్టారు. త్వరలోనే కేసు మిస్టరీ వీడే అవకాశమున్నది.


logo