శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:49:43

ఆరేండ్లలో రోడ్ల అభివృద్ధి

ఆరేండ్లలో రోడ్ల అభివృద్ధి
  • కొనసాగుతున్న వంతెనల నిర్మాణాలు
  • అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి వేముల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేండ్లలో రోడ్ల నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందుతున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, రాములు, చిన్నయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రామాలనుంచి మండలకేంద్రాలకు, మండలకేంద్రాల నుంచి జిల్లాకేంద్రాలకు సింగిల్‌, డబుల్‌, నాలుగు లేన్లరోడ్లు రూ.11,257 కోట్లతో 7,554 కి.మీ. మేర చేపట్టామని తెలిపారు. ఇందులో 5,553 కి.మీ. పూర్తిచేశామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) కింద 2,387 కి.మీ. రోడ్లను రూ.2,436 కోట్లతో చేపట్టగా, 1,551 కి.మీ. రహదారులను పూర్తిచేసిట్టు వివరించారు. మొత్తంగా రూ.10,803 కోట్లతో 16,800 కి.మీ. రోడ్‌ నెట్‌వర్క్‌ పనులు చేపట్టామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, నదులపై రూ.2,797 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జీరోఅవర్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌,  జాఫర్‌హుస్సేన్‌, సంజయ్‌, శ్రీధర్‌బాబు, రాజాసింగ్‌, చందర్‌, నోముల నర్సింహయ్య,  చెన్నమనేని రమేశ్‌, జైపాల్‌యాదవ్‌, రాజగోపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి తదితరులు తమ నియోజకవర్గాల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. 


పెరిగిన చేపల ఉత్పత్తి: మంత్రి తలసాని

2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరినాటికి 2.43 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2016-17 నుంచి రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 2016-17లో 1.99 లక్షల టన్నులు, 2017-18లో 2.07 లక్షల టన్నులు, 2018-19లో 2.94 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు వివరించారు. మత్స్యకారులకు రూ.750 కోట్ల విలువైన వస్తువులు అందజేశామని చెప్పారు. ఈ ఏడాది రూ.53.01 కోట్లు ఖర్చుపెట్టి 15,715 నీటి వనరుల్లో 64.10 కోట్ల చేపపిల్లలను, 70 నీటి వనరుల్లో 3.42 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను వదిలేందుకు ఉచితంగా సరఫరాచేశామన్నారు.


కల్యాణలక్ష్మి లబ్ధిదారులు 6,15,573 మంది: మంత్రి గంగుల

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు 6,15,573 కుటుంబాలు లబ్ధిపొందాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీల పేదింటి ఆడపిల్లలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.4,572.97 కోట్లు ఖర్చుచేశామని, బీసీలు 2,41,491, మైనార్టీలు 1,44,273, గిరిజనులు 85,512, ఎస్సీలు 1,44,297 కుటుంబాలు లబ్ధిపొందాయని తెలిపారు.


గురుకులాలు అద్భుతం: మంత్రి కొప్పుల

గురుకుల పాఠశాలలు అ ద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, హరిప్రియానాయక్‌, జాజుల సురేందర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, బాల్కసుమన్‌, జాఫర్‌ హుస్సేన్‌ అడిగిన ప్రశ్నలకు కొప్పుల సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 602 గురుకుల పాఠశాలల్లో 2,75,610 మంది ప్రవేశంపొందారని చెప్పారు. ప్రభుత్వం ఏడాదికి ఒక్కో గురుకుల విద్యార్థికి సగటున రూ.50,686 ఖర్చు చొప్పున మొత్తం విద్యార్థులపై రూ.5,719 కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే షకీల్‌అహ్మద్‌ ప్రశ్నకు స్పందిస్తూ.. మైనార్టీ గురుకుల విద్యార్థుల కోసం రూ.1260.24 కోట్లు ఖర్చుచేశామన్నారు. 


logo