బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 04:49:42

బాట బాగయింది

బాట బాగయింది
  • పక్కా ప్రణాళికతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి
  • అన్ని ఊర్లకు కనెక్టివిటీ దిశగా పనులు
  • పల్లెల నుంచి మండలాలకు
  • జిల్లా కేంద్రాలకు వేగంగా చేరేలా మార్గాలు
  • బడ్జెట్‌లో సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణానికి పక్కనే ఉన్నా సరైన రోడ్డులేని దుస్థితినుంచి తెలంగాణలో పల్లెలకు ప్రగతిదారులు పడ్డాయి. గ్రామాలకు వెళ్లే రోడ్లే కాదు.. ఊరిలోని అంతర్గత రహదారులు కూడా సీసీగా మారిపోయాయి. రూ.వేల కోట్లతో పల్లె నుంచి పల్లెకు సింగిల్‌ బీటీ రోడ్లు.. మండలకేంద్రాలను కలుపుతూ డబుల్‌ లేన్‌ రోడ్లుగా మారాయి. 2014నాటికి కేవలం 2,527.46 కి.మీ.ల జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు 5,682 కి.మీ. నెట్‌వర్క్‌గా మారింది. సింగిల్‌ రోడ్లకు స్వస్తిపలుకుతూ ఆర్‌అండ్‌బీ పరిధిలోని 15,731 కి.మీ. సింగిల్‌ లేన్‌ రోడ్లను రూ.7,029 కోట్లతో డబుల్‌ లేన్‌గా మారుస్తున్నారు. దాదాపు ఈ పనులన్నీ 80 శాతం పూర్తయ్యాయి. రాష్ట్రంలో 67,714 కి.మీ. మేర పంచాయతీరాజ్‌ రహదారులు ఉన్నాయి. 


ఇందులో 31,144 కి.మీ మట్టి రోడ్లు కాగా, 13,103 కి.మీ. కంకర, 23,467 కి.మీ. బీటీ రోడ్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధికి రూ.8,750 కోట్లు కేటాయించింది. 9,645 కి.మీ. మట్టి రోడ్లను బీటీగా మారుస్తుండగా, ఇప్పటికే 7,454 కి.మీ. పనిపూర్తయిం ది. బీటీ రోడ్లు 15,958 కి.మీ.గాను 14,583 కి.మీ. మరమ్మతులు పూర్తయ్యాయి. 635 వంతెనల నిర్మాణం చేపట్టగా 446 అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 16,661 కి.మీ. రోడ్లకు వివిధ విభాగాల్లో పనులు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం 25,171 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేసింది. బీటీ రోడ్ల రెన్యువల్‌లో భాగంగా 14,980.09కి.మీ. రహదారులకు రూ.2,246.41 కోట్లతో పనులుచేసింది. ఇందుకు ఎంఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ స్పెషల్‌, 13, 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించింది. ప్రధానంగా శివారు గ్రామాలు, పల్లెలను కలిపే రోడ్లను అప్‌గ్రేడ్‌ చేసింది. 10,191 కి.మీ. రోడ్లను అప్‌గ్రేడ్‌ చేసి రూ.4,648 కోట్లతో మరమ్మతులు చేసింది.


ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్‌ రోడ్లు

నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఏర్పాటైన కొత్త గ్రామపంచాయతీల్లో రోడ్ల కోసమే ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించింది. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడం, ఉన్న రోడ్లను మెరుగుపర్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నది. పంచాయత్‌రాజ్‌శాఖ పరిధిలోని 6,431 కి.మీ. రోడ్లను ఆర్‌అండ్‌బీకి బదిలీచేసింది. పల్లెల్లోని అంతర్గత రోడ్లను సైతం సీసీగా మారుస్తున్నారు. ఇందుకు ఉపాధి హామీతోపాటు పలు నిధులు వినియోగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 8,400 గ్రామాల్లో రూ.800 కోట్లకుపైగా వెచ్చించి సీసీరోడ్లు వేశారు. వీటి లో ఇప్పటివరకు మొదలైన సీసీ రోడ్ల పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిపోయిన అంతర్గత రోడ్ల నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.600 కోట్లు కేటాయించింది. ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు వీటిని అదనంగా ఇస్తున్నది. 


logo