మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 02:33:15

దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి రోడ్డు ప్రమాద బాధితుడు

దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి రోడ్డు ప్రమాద బాధితుడు

  • మాజీ ఎంపీ కవిత చొరవతో  క్షేమంగా ఇంటికి 

నవీపేట: బతుకు దెరువు కోసం దుబాయ్‌ వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో స్వగ్రామానికి చేరుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన దుర్గం వెంకటేశ్‌ రెండేండ్లుగా దుబాయ్‌లోని అబుదాబిలో పనిచేస్తున్నాడు. జూన్‌ 27న విధి నిర్వాహణలో భాగంగా కంపెనీ వాహనంలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. శస్త్రచికిత్స చేయించి పదిరోజుల తర్వాత డిశ్చార్జి చేసి కంపెనీ గదిలో వదిలి పెట్టారు. అక్కడ సహాయం చేసే వారు ఎవరూ లేక వెంకటేశ్‌ నరకయాతన అనుభవించాడు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ అవంతి కుమార్‌ ద్వారా విషయాన్ని మాజీ ఎంపీ కవితకు చేరవేసి సహాయం చేయాలని కోరాడు. కవిత సూచనల మేరకు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ)బాధ్యుడు కిరణ్‌ పీచర ద్వారా అనుమతులు క్లియర్‌ చేసి విమాన టికెట్‌ బుక్‌ చేయించి ఖర్చులు నిమిత్తం రూ. 10 వేలు అందించారు. వెంకటేశ్‌ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆయన్ను అంబులెన్స్‌లో జన్నేపల్లికి తరలించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. కాగా వెంకటేశ్‌ను జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింగ్‌రావు పరామర్శించారు.  

స్వగ్రామం చేరిన మరో గల్ఫ్‌ బాధితుడు

దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో పనిచేసేందుకు రెండేండ్ల క్రితం కంపెనీ వీసాపై వెళ్లిన నవీపేటకు చెందిన బీ కళ్యాణ్‌  కరోనా నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయాడు. ఇండియా వచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో అతని తండ్రి భూమయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ రాంకిషన్‌రావు ద్వారా మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కవిత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి ద్వారా బాధితుడికి విమాన చార్జీలు చెల్లించి స్వగ్రామానికి రప్పించారు. 


logo