హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో డెల్టా (బి.1.617.2) రకమే ఎక్కువని జన్యు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా వ్యాప్తించి, ఎక్కువ నష్టం కల్గించే డెల్టా పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ విస్తరిస్తున్నట్టు తేలింది. ఇండియా కొవిడ్-19 జీనోమిక్ సైర్వెలెన్స్ ఇనిషియేటివ్ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ ఫలితాలు వెలువడినాయి. జీనోమ్ సీక్వెన్స్ అనంతరం రాష్ట్రానికి చెందిన 81 శాతం శాంపిళ్లు డెల్టా రకమేనని తెలిసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో బీటా వేరియంట్ (బి.1.351) రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది. మే నెల నాటికి అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు డెల్టా వేరియంట్ చాప కింద నీరులా అత్యంత వేగంగా విస్తరించింది. ఫిబ్రవరిలో కేవలం 13 శాతంగా ఉన్న బీటా వేరియంట్, మార్చి వరకు 35 శాతానికి చేరింది. మే, జూన్ నాటికి ఆల్ఫా, బీటాలు తగ్గుముఖం పట్టగా, డెల్టా వేరియంట్ వ్యాపించింది.