బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:34:25

ముసురుతున్న విషపుగాలి

ముసురుతున్న విషపుగాలి

 •  దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం   
 • ఏటా 17 లక్షల మంది మృత్యువాత
 • మొత్తం మరణాల్లో 18 శాతం వాటా
 • అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం 
 • తెలంగాణలో పరిస్థితి కాస్త మెరుగు 
 • లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడి

ఊపిరి పోయాల్సిన గాలి ఉసురు తీస్తున్నది. ప్రాణాలు నిలపాల్సిన వాయువు కాలుష్య కాసారంగా ముసురుకుంటున్నది. ఏటా లక్షల మందిని ‘గాలి’లో కలిపేస్తున్నది. అనారోగ్యానికి గురిచేస్తూ కోట్ల కుటుంబాలపై మోయలేని ఆర్థికభారాన్ని మోపుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షల కోట్లు నష్టం కలిగిస్తున్నది. ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌'లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం ఈ విషయాలను స్పష్టం చేస్తున్నది. ‘ఇండియా స్టేట్‌ లెవల్‌ డిసీజ్‌ బర్డెన్‌ ఇనిషియేటివ్‌' పేరుతో ప్రచురితమైన ఈ వ్యాసంలోని వివరాలను కేంద్రం మంగళవారం విడుదల చేసింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో పరిశ్రమలు, వాహనాలు ఇతర మార్గాల ద్వారా విడుదలవుతున్న కలుషితాలే ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం స్పష్టం చేసింది. దీని ప్రకారం.. వాయుకాలుష్యం కారణంగా 2019లో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది మరణించారు. దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో ఇది 18 శాతం. చిన్న వయసులోనే మృతిచెందడం, దీర్ఘకాలిక రోగాలబారిన పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ముసురుతున్నాయి. మొత్తం రోగుల్లో 40 శాతం మందికి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తగా, 60 శాతం మందికి హృద్రోగ సమస్యలు, డయాబెటిస్‌, గర్భస్రావాలు వంటివి కనిపిస్తున్నాయి. చికిత్సకు అయ్యే ఖర్చు, మానవ వనరులను కోల్పోయి ఉత్పత్తి తగ్గడం వంటివాటితో సుమారు రూ.2.60 లక్షల కోట్లు నష్టం వాటిల్లుతున్నది. ఇది దేశ జీడీపీలో 1.4 శాతం. ఇది అసోం మినహా మిగతా అన్ని ఈశాన్య రాష్ర్టాల జీడీపీకంటే ఎక్కువ. అంతేకాకుండా దేశంలోని 14 రాష్ర్టాలు/ కేంద్ర పాలితప్రాంతాల జీడీపీ విలువ కన్నా ఈ నష్టం విలువే ఎక్కువ. 

వాయుకాలుష్యం రాష్ర్టాల తలసరి ఆదాయంపైనా భారీగానే ప్రభావం చూపుతున్నది. ఢిల్లీ అత్యధికంగా నష్టపోతుండగా, హర్యానా రెండోస్థానంలో ఉన్నది. ఢిల్లీలో సగటున రూ.4,350 తలసరి ఆదాయం కోల్పోతుండగా, హర్యానాలో రూ.3,780 నష్టపోతున్నారు. గోవా  మూడో స్థానం (రూ. 3,660)లో నిలిచింది.

దేశంలో గ్యాస్‌ వినియోగం, ప్రజల్లో అవగాహన పెరగడంతో ఇండ్ల నుంచి వెలువడే కలుషితాల పరిమాణం చాలావరకు తగ్గింది. 1990-2019 మధ్య పోల్చినప్పుడు ఇండ్ల ల్లో నుంచి వెలువడే కాలుష్యం 65 శాతం తగ్గగా.. ఇతర మార్గాల నుంచి గాలిలోకి కలుషితాలు చేరడం 115 శాతం పెరిగింది.

మేలుకుంటేనే బాగు

భారతదేశం విద్య, వైద్యం, ఆర్థిక, సామాజికరంగాల్లో దూసుకుపోతున్నదని జర్నల్‌ పేర్కొన్నది. దేశాభివృద్ధికి వాయుకాలుష్యం ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇప్పటికే సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడకుండా పెద్దఎత్తున సోలార్‌, విండ్‌ తదితర ప్రత్యామ్నాయ ఇంధనశక్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతించింది. దీనిని మరింత వేగవంతం చేయాలని సూచించింది. వాయుకాలుష్యాన్ని తగ్గించగలిగితే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ప్రభుత్వాలకు ఆర్థికభారం తగ్గుతుందని వెల్లడించింది.

తెలంగాణ మెరుగే 

వాయుకాలుష్యం, అనంతర పరిణామాల వల్ల కలుగుతున్న నష్టాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి పెద్దరాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో కాస్త తక్కువేనని నివేదిక స్పష్టం చేస్తున్నది. రాష్ట్రంలో వాయుకాలుష్యం ప్రభావం తక్కువగా ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్ర జనాభాలో సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడిన వారి సంఖ్యతో పోల్చినప్పుడు తెలంగాణ దేశంలోనే టాప్‌-4లో నిలిచింది. తెలంగాణ, తమిళనాడు, గోవా, ఢిల్లీలో మాత్రమే 30 శాతం కన్నా తక్కువ జనాభా చమురుపై ఆధారపడింది. 

గాలి కాలుష్యంతో..

 • 2019లో మరణాలు:17 లక్షలు 
 • ఆర్థిక నష్టం:రూ.2.60 లక్షల కోట్లు 
 • అకాల మరణాలతో నష్టం: రూ.2.05 లక్షల కోట్లు 
 • అనారోగ్యంబారినపడటంతో నష్టం: రూ.55 వేల కోట్లు 
 • దేశ జీడీపీతో పోల్చితే నష్టం : 1.4 శాతం 
 • తలసరి ఆదాయ నష్టం: రూ.2 వేలు 


logo