సోమవారం 25 మే 2020
Telangana - Apr 04, 2020 , 00:50:36

నెలాఖరుదాకా బియ్యం పంపిణీ

నెలాఖరుదాకా బియ్యం పంపిణీ

-బియ్యం తీసుకోకున్నా రూ.1,500 జమ

-పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యాన్ని నెలాఖరువరకు పంపిణీచేస్తామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. 15 రోజుల నిబంధనను ఎత్తివేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రేషన్‌ పంపిణీపై శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల నెలాఖరు వరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటలవరకు రేషన్‌ షాపులు తెరిచే ఉంటాయన్నారు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండుమూడు రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,500 నగదును ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, పోలీసు షెల్టర్‌లో ఉన్నవారికి, కిందిస్థాయి సిబ్బందికి భోజనం అందించడానికి బియ్యం సరఫరా చేయాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో రైస్‌ మిల్లర్లు 90 క్విటాళ్ల బియ్యం అందజేశారు. 

ఆహార పంపిణీ బాధ్యత అదనపు కలెక్టర్లకు

దాతలు ఎవరైనా పేదలకు విరాళాలు, ఆహారం అందజేయాలనుకుంటే జీహెచ్‌ఎంసీ ద్వారా వితరణ చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ కోరారు. రంగారెడ్డి మణికొండలో ఒక వ్యక్తి వితరణ చేసిన సమయంలో 3 వేల మంది ఒకేచోట గుమిగూడారనే విషయం తమ దృష్టికొచ్చిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఒక కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటుచేసి అదనపు కమిషనర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాతలు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. జీహెచ్‌ఎంసీయే అవసరమైనవారికి అందజేస్తుందని చెప్పారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్లను నియమించాలని ఆదేశించారు.

ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవలకు, నిత్యావసరాల రవాణాలో ఇబ్బంది రాకుండా పోలీస్‌శాఖ ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ సత్ఫలితాలనిస్తున్నది. ఆహార పదార్థాలు, మందులు, ఇతర సామగ్రిని తరలించే వాహనాలు అడ్డుకోకుండా ఉండేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. 25 మంది అధికారుల బృందం నిత్యం రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర, నిత్యావసరాల రవాణాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే తగిన సూచనలు చేస్తున్నారు. 


logo