శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 02:01:58

ఆర్జీయూకేటీలో బోధన అద్భుతం

ఆర్జీయూకేటీలో బోధన అద్భుతం

  • సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో (ఆర్జీయూకేటీ) బోధనా విధానం అద్భుతంగా ఉన్నదని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ ప్రశంసించారు. ఆర్జీయూకేటీ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ సంఘం ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వర్సిటీలోని వసతులు, ప్రత్యేకతపై ఆరా తీశారు. వర్సిటీకి అనుబంధంగా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు అవసరమని, ఇందుకు కృషిచేస్తానని చెప్పారు. ఆర్జీయూకేటీ స్థాయి ట్రిపుల్‌ఐటీ కన్నా గొప్పదని తెలిపారు. ఆనవాయితీగా ట్రిపుల్‌ఐటీ అని పిలుస్తున్నారని, ట్రిపుల్‌ఐటీల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ట్రేడ్‌ కోర్సులు మాత్రమే బోధించాల్సి ఉంటుందని, కానీ ఆర్జీయూకేటీలో టెన్త్‌ పాసైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, ఇంటర్‌, ఇంజినీరింగ్‌ వరకు బోధిస్తున్నారని ప్రశంసించారు. సిబ్బంది సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. టీచింగ్‌ ఎంప్లాయీస్‌ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాయికృష్ణ, కార్యదర్శి కృష్ణప్రసాద్‌, కోశాధికారి రాకేశ్‌రెడ్డి, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ దత్తు వినోద్‌ను కలిశారు.