మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 16:07:55

ఈ నెల 25న ధరణి పోర్టల్‌ ప్రారంభం: సీఎస్‌

ఈ నెల 25న ధరణి పోర్టల్‌ ప్రారంభం: సీఎస్‌

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని సోమేశ్‌కుమార్‌ అన్నారు. శనివారం పోర్టల్‌ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీసీకి అదనపు కలెక్టర్లతో పాటు తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్లు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 570 మండలాల్లోని తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా పని చేస్తారని, సబ్ రిజిస్ట్రార్ అధికారులు 142 ప్రదేశాల నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. పోర్టల్‌ పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో ఉంటుందని చెప్పారు. ధరణి పోర్టల్‌ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించి, అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

తహసీల్దార్లు రేపటి కల్లా కనీసం పది లావాదేవీలను ప్రయోగాత్మకంగా పూర్తి చేయాలని సూచించారు. ధరణి సేవలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టీఎస్‌టీఎస్‌ ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వీసీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజీ శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్, ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, పీఆర్‌ఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo