శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:27:43

నల్ల గొర్రె మన బ్రాండ్‌

నల్ల గొర్రె మన బ్రాండ్‌

  • వనపర్తికి పరిశోధనా కేంద్రం కేటాయింపు దక్కనీ గొర్రెల ఉత్పత్తికి సర్కారు
  • వనపర్తికి పరిశోధనా కేంద్రం కేటాయింప
  • దక్కనీ గొర్రెల ఉత్పత్తికి సర్కారు 

గొల్లకురుమల సంక్షేమానికి కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మేలుజాతి గొర్రెలు, పొట్టేళ్ల ఉత్పత్తిపై దృష్టిసారించింది. కనుమరుగవుతున్న తెలంగాణ బ్రాండ్‌ దక్కనీ గొర్రెల (నల్ల గొర్రెలు) సంతతిని రక్షించడంతోపాటు స్థానిక బ్రీడ్‌ జీవాల ఉత్పత్తి పెంచేందుకు వనపర్తి జిల్లాకు గొర్రెల పరిశోధన కేంద్రాన్ని కేటాయించింది. రోగాలను తట్టుకుంటూనే ఎక్కువ మాంసం, ఉన్ని లభించే గొర్రెలు, పొట్టేళ్లను ఈ కేంద్రం ద్వారా అభివృద్ధి చేయనున్నది.

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను బాగు చేసేందుకు తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా గొర్రెల పెంపకానికి విశేష ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్లకురుమల సంక్షే మం కోసం పెద్దఎత్తున గొర్రెలను పంపిణీ చేసింది. తాజాగా తెలంగాణ బ్రాండ్‌ దక్కనీ (నల్ల గొర్రెలు), స్థానిక బ్రీడ్‌ను కాపాడుకునేందుకు రాష్ట్రంలోనే ఏకైక గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని వనపర్తి జిల్లాకు మంజూరుచేసింది. ఈ కేంద్రం ద్వారా గొర్రెల ఉత్పత్తిపై పరిశోధన జరగనున్నది. ఎక్కువ మాంసం, ఉన్ని లభించే గొర్రెలను ఇక్కడ అభివృద్ధి చేయనుండగా.. గొల్లకురుమల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

మాంసం డిమాండ్‌ తీర్చేందుకు.. 

మాంసం డిమాండ్‌కు సరిపోను గొర్రెలు రాష్ట్రంలో లేవన్న కారణంతోనే సీఎం కేసీఆర్‌ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గొర్రెల పెంపకంపై అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. గొల్ల కురుమలతోపాటు ఇతరులు సైతం గొర్రెలను పెంచి ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో జీవాలకు ఎక్కడాలేని డిమాండ్‌ ఏర్పడింది. దీంతో స్థానికంగా మేలు రకం గొర్రెలను ఉత్పత్తి చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా రాజాపేటలో 21 ఎకరాల విస్తీర్ణంలో మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో గొర్రె పిల్లల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానున్నది.

తెలంగాణ బ్రాండ్‌ దక్కనీ గొర్రెలు..

కనుమరుగయ్యే దశలో ఉన్న తెలంగాణ బ్రాండ్‌ దక్కనీ గొర్రెలకు.. పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో మంచిరోజులు రానున్నాయి. ఈ కేంద్రంలో మేలు రకమైన దక్కనీ, నెల్లూరు జుడుపీ రకాలకు మరింత నాణ్యమైన బ్రీడ్‌ తయారుచేయడం తదితర కార్యక్రమాలు చేయనున్నారు. నాణ్యమైన మాంసం, మరింత ఉన్నిని ఇచ్చే గొర్రెలను అభివృద్ధి చేయనున్నారు. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఇప్పటికే దక్కనీ గొర్రెలు, మేకల పరిశోధనా కేంద్రం ఉన్నది. ఇక్కడ 400 దక్కనీ గొర్రెలను పెంచుతున్నారు. ఈ బ్రీడ్‌ను కాపాడేందుకు పాలమూరు పరిశోధనా కేంద్రం కృషి చేయనున్నది.  

గొర్ల కాపరులకు ఎంతో మేలు

గొర్రెల పరిశోధ నా కేంద్రం ఏర్పాటుతో గొర్రెకాపరులకు మరింత మేలు జరుగుతుంది. కేం ద్రం ద్వారా మరిం త మేలైన గొర్రె పిల్లలు లభిస్తాయి. మంచి మాంసం, అధిక ఉన్ని ఇచ్చే జాతులను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.

- వెంకటేశ్వర్‌రెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, వనపర్తి
శుభపరిణామం 

యాదవులు అత్యధిక శాతం గొర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వనపర్తి జిల్లాలో గొ ర్రెల పరిశోధనా కేంద్రం, ఉత్పత్తి కేం ద్రం ఏర్పాటు కావడం శుభపరిణామం. గతంలో గొర్రెలకు సమస్యవస్తే  ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడేవాళ్లం. పరిశోధన కేంద్రం ఏర్పాటుతో సమస్యలు తొలగినట్లే.

- కురుమూర్తియాదవ్‌, గొర్రెకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు, వనపర్తి


logo