సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 11:38:29

జూలై 2 నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం పున: ప్రారంభం

జూలై 2 నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం పున: ప్రారంభం

జోగులాంబ గద్వాల : చాలా ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు ఇప్పటివరకు ఆచితూచి అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాదాయశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ తగిన ఏర్పాట్లు చేశారు. జులై 2వ తేదీ నుంచి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించినట్లు మఠం మేనేజర్‌ వెంకటేశ్‌ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లలోపు, 65 ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, కంటైన్‌మెంటు జోన్ల నుంచి వచ్చేవారు మినహా అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత కొవిడ్‌ లక్షణాలు లేనివారినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నవితరణ, ప్రసాదాల పంపిణీ తదితరాలు ప్రస్తుతానికి లేవన్నారు. ఆర్జిత సేవలు పరోక్షంగా నిర్వహిస్తామని, గర్భగుడి దర్శనాలు లేవన్నారు. మరోవైపు దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.


logo