గురువారం 09 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 17:41:30

జీవో 3పై మూడు, నాలుగు రోజుల్లో రివ్యూ పిటిషన్

జీవో 3పై మూడు, నాలుగు రోజుల్లో రివ్యూ పిటిషన్

హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం గిరిజనులతో భర్తీ చేయాలనే జీవో 3ని పునరుద్ధరించే విధంగా సుప్రీం కోర్టులో సమగ్రమైన నివేదికతో 3,4 రోజుల్లో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జీవో 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రిసమీక్ష చేశారు. 

2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో 3 వచ్చినందున, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ఈ జీవో పునరుద్ధరణ కోసం రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు ఆ రాష్ట్రంతో సంప్రదింపుల ద్వారా నివేదిక రూపొందించినట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు, సూచనలతో డ్రాఫ్ట్ ని తయారు చేసి, సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ సహకారం, సీనియర్ న్యాయవాదులు, నిపుణుల అభిప్రాయాలకనుగుణంగా రివ్యూ పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. 

 రాష్ట్ర విభజన చట్టం హామీల్లో భాగంగా రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


logo