ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 16:13:35

జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్

జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్

హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ గిరిజనుల హక్కులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే సీఎం కేసీఆర్ జీవో 3 కొనసాగించేందుకు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు వీలుగా 2000 సంవత్సరంలో ఇచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. 

గిరిజనుల అవకాశాలను దెబ్బతీసే సుప్రీం కోర్టు నిర్ణయం పట్ల రివ్యూ పిటిషన్ వేయడానికి సీఎం కేసీఆర్ అంగీకరించడంతో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో  మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో సుప్రీం కోర్టు జీవో 3ని కొట్టివేసిందని, వెంటనే దీనిపై న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ కూడా అంగీకరించడంతో త్వరలో సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిని పెట్టి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.

గిరిజనుల అవకాశాలను, హక్కులను కాపాడే జీవో 3ని కొనసాగింపునకు రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించిన సీఎం కేసీఆర్ కు గిరిజనులందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు అవకాశాలు కల్పించే జీవో 3ని కొనసాగించేందుకు కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో మాట్లాడినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం పాటుపడుతుంటే కాంగ్రెస్ ఉనికి కోసం దీక్షలు చేస్తోందని విమర్శంచారు. దీక్షలు చేస్తే జీవో రాదని వారికి కూడా తెలుసని, అయినా సరే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.logo