ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:36

జీవో 3పై ‘సుప్రీం’లో రివ్యూ పిటిషన్‌

జీవో 3పై ‘సుప్రీం’లో రివ్యూ పిటిషన్‌

  • గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజనుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. జీవో3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. మంగళవారం మంత్రి సత్యవతిరాథోడ్‌ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు. గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ నేతలు అర్థరహిత విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ వేసిందని, ఈ మేరకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. దీనిపై కేంద్రం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తుండటంతో ఎస్టీలు విద్య, ఉద్యోగరంగాల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంచేసిన తీర్మానాన్ని ఆమోదింపజేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.


logo