గురువారం 16 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 21:54:38

అభివృద్ధి పనులపై మంత్రి కొప్పుల సమీక్ష

అభివృద్ధి పనులపై మంత్రి కొప్పుల సమీక్ష

జగిత్యాల : ధర్మపురి నియోజకవర్గంలో గొర్రెల సామూహిక షేడ్స్ నిర్మాణం, శ్మశాన వాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై సోమవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో జలహితం కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో 1200 కిలోమీటర్ల పొడవున కాల్వల పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని వెల్లడించారు.  ధర్మపురి నియోజకవర్గంలో సామూహిక గొర్రెల షేడ్స్ నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొల్ల, కుర్మలకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను అందించిందని, గ్రాయాల వారీగా గొర్రెల షేడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. వీటి నిర్మాణానికి గొల్ల, కుర్మ సొసైటీలకు భూమి ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. శ్మశానవాటిక (వైకుంఠం ధామం) నిర్మాణంలో ఇబ్బందులుంటే ఎంఆర్‌ఓ, ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల వారీగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోని వివరాలు సేకరించి నిర్మించుకునేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులు జగిత్యాల డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి డీఆర్‌డీఓ వినోద్ ఎంపీడీఓలు,  ఎంఆర్‌ఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు.


logo