e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides ప్రభుత్వ భూమిని కాపాడబోతే ఎమ్మార్వోపై ఉల్టా కేసు

ప్రభుత్వ భూమిని కాపాడబోతే ఎమ్మార్వోపై ఉల్టా కేసు

ప్రభుత్వ భూమిని కాపాడబోతే ఎమ్మార్వోపై ఉల్టా కేసు
  • కాప్రా ఎవాక్యూ భూముల వ్యవహారంలో విచిత్రం
  • సంబంధం లేని ఎమ్మెల్యేనూ వివాదంలోకి లాగే యత్నం
  • ఐదేండ్లుగా కబ్జాలు.. తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది
  • ఈ ఏడాది మార్చిలో అధికారులపై దాడికి యత్నం
  • ఎదురు కేసులు పెట్టి బెదిరించేందుకు కబ్జాకోరుల కుట్ర
  • ఒత్తిడి తెచ్చినా భూమిని కాపాడుతాం: తాసిల్దార్‌
  • భూముల రక్షణ ఎమ్మెల్యేగా నా బాధ్యత: సుభాష్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్‌/కాప్రా: ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే.. అంటే ఇదేనేమో! హైదరాబాద్‌ కాప్రా పాంతంలో ఉన్న ఎవాక్యూ భూముల విలువ కోట్లలోనే ఉంటుంది. వాటిపై కొందరు కన్నేశారు. ఆ భూముల కబ్జాలకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. ఐదేండ్లుగా ఈ తతంగం నడుస్తూనే ఉన్నది. ఇలా కాదని.. కొందరు వ్యక్తులు కేసుల పేరుతో పరోక్షంగా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా తమపైనే అధికారులు దాడి చేశారంటూ తాసిల్దార్‌పైన, ఎలాంటి సంబంధంలేని ఉప్పల్‌ ఎమ్మెల్యేపైన కోర్టు ద్వారా కేసు నమోదు చేయించారు. కేసులతో భయపెడితే తమ కబ్జాలకు అడ్డుండదనే ఈ కుట్ర పన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, కాప్రా గ్రామపరిధిలోని సర్వే నంబర్లు 9, 11, 47, 140-143, 151-153, 676, 677ల్లో 90.08 ఎకరాల భూమి ఉన్నది. వాస్తవానికి గతంలో ఇది మందాల బుచ్చం పేరిట ఉండగా.. సదరు వ్యక్తి 1942లో మరణించారు. అనంతరం పోలీసు యాక్షన్‌లో ఈ భూములను కోర్టు వేలం వేసింది. తదనంతరం భూమిపై హక్కులు పొందిన రహీం బక్స్‌ పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. దీంతో జిల్లా కలెక్టర్‌ కస్టోడియన్‌గా వీటిని ఎవాక్యూ భూములుగా గుర్తిస్తూ నోటిఫై (నోటిఫికేషన్‌ నంబర్‌ సీఈ/4050/హెచ్‌వైడీ/52, తేదీ.11.2.1952) చేశారు. ఈ మేరకు 11.12.1952న గెజిట్‌ (నం.55 సీఈ/4064 నుంచి 4080) కూడా పబ్లిష్‌చేశారు. తర్వాత 1954- 55 కాస్రా పహాణీలో ఈ సర్వే నంబర్లలోని 90.08 ఎకరాలను ‘సర్కారీ కస్టోడియన్‌’ భూముల జాబితాలో చేర్చారు. అనంతరం 1966-68 మధ్య గోకుల్‌దాస్‌ పేరిట 56.04 ఎకరాలు, ఈశ్వరీబాయి పేరిట 20.27 ఎకరాలు, మథురదాస్‌ పేరిట 13.17 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఈశ్వరీబాయి, మథురాదాస్‌ పేర్లు మాత్రమే పహాణీలోకి ఎక్కాయి. గోకుల్‌దాస్‌ పేరు కొన్ని కారణాల వల్ల రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఈ భూములపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు నమోదై, కొనేండ్లపాటు వాదోపవాదాలు సాగాయి. చివరకు 2011లో సుప్రీంకోర్టు సదరు సర్వే నంబర్లలోని 90.08 ఎకరాలు ఎవాక్యూ భూములేనని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ భూములను కాపాడాలని స్పష్టంచేసింది. భూములను కబ్జాల నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అప్పటి రంగారెడ్డి కలెక్టర్‌ సంబంధిత రెవెన్యూ, మండల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

నిబంధనల మేరకు అధికారుల అడుగులు

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఈ భూములకు సంబంధించి ఎవరైనా నిజమైన హక్కుదారులుంటే సంబంధిత ఆధారాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం సంతృప్తికరంగా ఉంటే కోర్టుకు సమాచారం ఇచ్చి, వారికి భూములను కేటాయించవచ్చని ఉన్నదని కాప్రా తాసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో 2016లోనే 90.08 ఎకరాల్లో 20.27 ఎకరాలు తమవంటూ ఎం బాలకృష్ణ అనే వ్యక్తి ఈ భూముల్లో ఫెన్సింగ్‌కు ప్రయత్నించారు. దీంతో తాసిల్దార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆ కబ్జాను అడ్డుకొన్నారు. తరచూ ఇదేరీతిన కబ్జాకు ప్రయత్నించినా అధికారులు అడ్డుకొని కాపాడారు. ఈ క్రమంలో సదరు బాలకృష్ణ కోర్టులను ఆశ్రయించి భూమి తమదేనని కోరడంతో అనంతరం జరిగిన పరిణామాల్లో కోర్టు ఆదేశానుసారం అధికారులు 20.27 ఎకరాలను బాలకృష్ణ పేరిట మ్యుటేషన్‌ చేశారు. 2017లో ఇందుకు సంబంధించి అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సర్వే నంబర్లు 47, 141, 151, 152, 153ల్లోని మిగిలిన 69.21 ఎకరాలు ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నది. అంటే అధికారులు నిబంధనల ప్రకారం సదరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ఆదేశాలు తెచ్చుకున్నట్టయితే వాటిని అమలుచేశారు.

మార్చిలో కబ్జాను అడ్డుకున్న అధికారులు

సదరు 90.08 ఎకరాల భూమి తమదేనంటూ ఎం నందం, ఇతరుల పేరిట జీపీఏ ఉన్నదని కొం దరు కొంతకాలంగా ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 16న చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు కడీలు, ఇతర సామగ్రి తెచ్చారు. అవి ఎవాక్యూ భూములు అయినందున కాప్రా తాసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌ తన యంత్రాంగంతో వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే శరత్‌చంద్రారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ అనే వ్యక్తుల ఆధ్వర్యంలో గుంపుగా వచ్చి తమపై దాడికి యత్నించినట్టు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా సదరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు. ఇం దుకు సంబంధించి తాసిల్దార్‌ సమగ్ర నివేదికను ఈ నెల 3న జిల్లా కలెక్టర్‌కు కూడా సమర్పించారు.

ఉత్తర్వులు లేకుండా దౌర్జన్యంగా..

ఆ భూములు ఎవరివైనా చట్టం ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు తీసుకొస్తే కచ్చితంగా వాటిని అమలుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఈ మేరకు గతంలో 20.27 ఎకరాలను నిబంధనల ప్రకారం అధికారులు బాలకృష్ణ అనే వ్యక్తి పేరిట మ్యుటేషన్‌ కూడా చేశారు. ఈ భూములు తమవేనంటున్న ఎం నందం, ఇతరులు న్యాయస్థానాలు, ఉన్నతాధికారుల నుంచి తగిన ఉత్తర్వులు తీసుకొస్తే కిందిస్థాయిలోని తాసిల్దార్‌, ఇతర యంత్రాంగం వాటిని అమలుచేస్తారు. అవేవీ లేకుండా, పైగా 69.21 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు యత్నిస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకుంటారు. ప్రస్తుతం అవి ఎవాక్యూ భూములుగా ఉన్నందున కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ఇవేవీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతోపాటు అడ్డుకున్న అధికారులపై, అసలు సంబంధం లేని ఎమ్మెల్యేపై సదరు వ్యక్తులు కేసులు పెట్టడమే విచిత్రంగా ఉన్నది. పైగా అధికారులు సదరు వ్యక్తులపై దాదాగిరీ చేయడంతోపాటు జేసీబీతో చంపేందుకు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. కోర్టు ఆదేశాలు చూపినా తాసిల్దార్‌ తమపై దౌర్జన్యం చేశారని సదరు వ్యక్తులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవంగా కోర్టు ఆదేశాలు ఉంటే, వాటికి తాసిల్దార్‌ అడ్డుపడితే కోర్టు ఉల్లంఘన (కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు)కు అవకాశం ఉన్నది. కానీ అవకాశాలను వినియోగించుకోవడం లేదంటే ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ భూములపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఫెన్సింగ్‌ ఎలా వేస్తారు? అలా చేయడం చట్ట విరుద్ధమైనందునే అధికారులు అడ్డుకున్నారనేది వాస్తవం.

తాసిల్దార్‌పై కేసులు ఉపసంహరించాలి

కాప్రా పరిధిలో కస్టోడియన్‌ భూములను ఆక్రమించడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్న కాప్రా తాసిల్దార్‌ కే గౌతమ్‌కుమార్‌పై క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తాసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌ నైతిక సె్థైర్యాన్ని దెబ్బతీయటానికి క్రిమినల్‌ కేసు దాఖలు చేసినట్లుగా అవగతమవుతున్నది. రాష్ట్రంలో గతంలో అనేకచోట్ల తాసిల్దార్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర కేసులు నమోదు చేశారు. ఈ చర్యలవల్ల తాసిల్దార్లు ఒకవైపు కబ్జాదారుల దురాగతాల వల్ల అవమానాలు ఎదురోవాల్సి రావడమే కాక క్రిమినల్‌ కేసులు ఎదురొంటూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. కాప్రా తాసిల్దార్‌పై నమోదు చేసిన కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి.

ట్రెసా నేతలు వంగ రవీందర్‌రెడ్డి, మన్నె ప్రభాకర్‌, కే నిరంజన్‌రావు, రాంరెడ్డి

నాపై ఆరోపణల్లో నిజంలేదు
నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారు ఆ ఆరోపణలు రుజువు చేయాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేదిలేదు. ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం తప్పక పరిరక్షిస్తుంది. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు కాపాడుతా. నాపై ఆరోపణలు చేసే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు, నిర్ధారించేందుకు రెవెన్యూ యం త్రాంగం ఉన్నది. వారి పని వారు చేస్తారు. నాపై నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువునష్టం దావా వేస్తా.

బేతి సుభాష్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే

కస్టోడియన్‌ ప్రాపర్టీని రక్షించినందుకే కేసులు
విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ కస్టడీలో ఉన్న స్థలాలను పరిరక్షించడమే మా ధ్యేయం. సర్వే నంబర్‌ 152, 153 లోని 23.27 ఎకరా లు కస్టో డియన్‌ ప్రాపర్టీని ఆక్రమించేందుకు ఫెన్సింగ్‌ చేపడుతుంటే అడ్డుకున్నాం. కేసులు నమోదు చేశాం. ఆ అక్కసుతోనే మాపై కేసు లు పెట్టారని భావిస్తున్నాం. విధినిర్వహణలో భాగంగా ఆక్రమణలను అరికట్టడం తప్పెలా అవుతుంది?

గౌతమ్‌కుమార్‌, కాప్రా తాసిల్దార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ భూమిని కాపాడబోతే ఎమ్మార్వోపై ఉల్టా కేసు

ట్రెండింగ్‌

Advertisement