బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:59:41

రైతు కండ్లలో.. ధరణి కాంతులు

రైతు కండ్లలో.. ధరణి కాంతులు

  • పోర్టల్‌ సేవలపై రెవెన్యూ అధికారుల సంతోషం
  • క్రయ విక్రయదారుల్లో ఆనందం కనిపిస్తున్నదంటున్న తాసిల్దార్లు
  • భవిష్యత్తులో అవినీతి మరక పోతుందని ఆశాభావం

దళారులు లేరు, దోపిడీలు లేవు, కాలయాపన లేదు, కబ్జాల్లేవు, లంచం అసలే లేదు.. దీంతో ఇటు రైతులు, అటు తాసిల్దార్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరణి వల్ల తొందరగా పని పూర్తయిపోతున్నదని అన్నదాతలు సంతోషపడుతుంటే, అవినీతి మరకపోతే అంతకన్నా హ్యాపీ ఇంకేం ఉంటుందని తాసిల్దార్లు అంటున్నారు. మొత్తంగా ధరణి ప్రజలకు, అధికారులకు వరంగా మారింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణితో రైతులే కాదు.. రెవెన్యూ అధికారులు కూడా సంతోషంగా ఉన్నారు. పోర్టల్‌ వల్ల తమకు వ్యక్తిగత, వృత్తిపరమైన సంతృప్తి కలుగుతున్నదని చెప్తున్నారు. తమ కార్యాలయానికి వచ్చిన ప్రతి రైతు ఆనందంతో ఇంటికి వెళ్తున్నారని, ఇది ఆనందాన్ని కలిగిస్తున్నదని అంటున్నారు. అతి త్వరలోనే రెవెన్యూ వ్వవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతుందని సంబురపడుతున్నారు. ఇప్పటికే మార్పు మొదలైందని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ నేతలు, దళారులు, పై అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ విధులను అదనపు భారంగా భావించడం లేదని, పైగా ఇది తమకు లభించిన సదవకాశమని పేర్కొంటున్నారు. ‘మేము ఉన్నదే రైతుల కోసం. మా ప్రధాన విధులన్నీ రైతు కేంద్రంగానే ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ ఒకచోట మ్యుటేషన్‌ మా దగ్గర జరుగుతుంటే ఇన్నాళ్లు కొంత అసంతృప్తి ఉండేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది’ అని మెదక్‌ జిల్లాకు చెందిన ఓ తాసిల్దార్‌ పేర్కొన్నారు. గతంలో కొందరు భూమి కొనుగోలు చేసినా, మ్యుటేషన్‌పై పెద్దగా అవగాహన లేక ఏండ్లపాటు దరఖాస్తు చేసుకోలేదన్నారు. దీంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగేవని, నష్టం జరిగిన తర్వాత వచ్చి తమతో మొరపెట్టుకునేవారని చెప్పారు. అప్పటికి తమ చేయిదాటి పోయేదని, వారిని ఓదార్చడం తప్ప ఎలాంటి ఫలితం ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ రెండూ తమ కార్యాలయంలోనే జరుగుతుండటం, తమ చేతులమీదుగానే పట్టాలు అందిస్తుండటంతో సంతోషంగా ఉన్నదన్నారు. ‘భూమి అమ్మినవారికి, కొనుగోలు చేసినవారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. వాళ్లు మరోసారి మా వద్దకు రావాల్సిన అవసరం ఉండదు. అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు’ అన్న ఆలోచనే కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నదని పలువురు తాసిల్దార్లు చెప్తున్నారు. ‘ఇం త తొందరగా అయిపోయిందా?’ అని, ‘ఇంకో ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదా?’ అని ఆశ్చర్యపోతున్నారని, సంబురంతో ఇంటికి వెళ్తున్న వారి ముఖాలు చూస్తే ఆత్మసంతృప్తి కలుగుతున్నదని అన్నారు.

ఒత్తిడి ఉండదు

గతంలో తాసిల్దార్లకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవి. పైఅధికారులు, చోటామోటా నాయకులు మొదలు పలుకుబడి ఉన్న రాజకీయ నేతల వరకు ‘మాకు అనుకూలంగా చేయండి’ అంటూ సిఫారసులు చేసేవారు. దీనికితోడు కొందరు దళారులు అధికారులతో పని చేయిస్తామని చెప్పి, డబ్బు గుంజుకొనేవారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు వచ్చింది. ఇప్పుడు ఇలాంటివాటికి ఎక్కడా అవకాశం లేకుండా చట్టం పకడ్బందీగా అమలు చేస్తుండటంతో శాఖపై ఇకపై మంచి పేరే ప్రచారం అవుతుందని భావిస్తున్నారు. 

అపవాదు పోతుంది

రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు ఒకరకమైన భావన ఉన్నది. అవినీతిదే రాజ్యమని బలంగా ఫిక్సయ్యారు. ధరణి రాక తర్వాత ఆ భావన క్రమంగా కనుమరుగవుతున్నదని అధికారులు సంబురపడుతున్నారు. ‘రూ.200 చెల్లించి స్లాట్‌బుక్‌ చేసుకుంటున్నారు. స్టాంప్‌డ్యూటీ, ఇతర ఫీజులు అక్కడే చెల్లిస్తున్నారు. సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వస్తున్నారు. పావుగంటలో పట్టా తీసుకొని ఇంటికివెళ్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేదు. ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం రాదు’ అని వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన తాసిల్దార్‌ పేర్కొన్నారు.  పెండింగ్‌ సమస్యలన్నీ పూర్తయితే రెవెన్యూ వ్యవస్థపై అవినీతి ముద్ర పూర్తిగా చెరిగిపోతుందన్నారు. 

ఏజెన్సీల్లో రేపట్నుంచి సేవలు 

కొత్తగూడెం: ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ధరణి సేవలు  ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని 22 మండలాలు సహా, ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల్లో ధరణి సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి లావాదేవీలు జరుగనున్నాయి. అందుకోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో గతంలో భూముల విక్రయాలు జరుగాలంటే చాలా సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా గిరిజన వ్యక్తి దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్‌ పరిశీలించి సంబంధిత తాసిల్దార్‌ కార్యాలయానికి నివేదిక పంపుతారు. పరిశీలించిన భూమి సమాచారం భూయజమానికి ఫోన్‌ ద్వారా మెసేజ్‌ వస్తుంది. దీంతో భూమి యజమాని స్లాట్‌ బుక్‌ చేసుకొని లావాదేవీలు జరుపవచ్చు.

రైతులు ఆశ్చర్యపోతున్నారు

రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకే దగ్గర పూర్తవుతుండటంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. ‘సార్‌.. నిజంగానే మళ్లా ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదా?’ అని కొందరు అమాయకంగా అడుగుతున్నారు. అలాంటివారి కండ్లలో సంతోషం కనిపిస్తున్నది. పెండింగ్‌ మ్యుటేషన్లు, పార్ట్‌ బీ సమస్యలు కూడా పూర్తయితే రైతులెవరూ తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరమే ఉండదు.

- ధనావత్‌ దేవుజా, మంచాల తాసిల్దార్‌, రంగారెడ్డి జిల్లా

అద్భుతమైన ముందడుగు ఇది

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం.. ధరణి. గతంలో ఆఫీసర్లకు ఒక సమయం అంటూ ఉండేది కాదు. ఇప్పుడు మధ్యాహ్నం 3:30 గంటల వరకు కచ్చితంగా ఆఫీస్‌లో కూర్చొని, రిజిస్ట్రేషన్‌ వర్క్‌ చేస్తున్నాం. రైతులకు కూడా పని ఎంతో సులువైంది. కొత్త చట్టంతో రైతులకు, అధికారులకు మధ్య దళారుల ప్రమేయం ఉండదు. కాబట్టి అవినీతికి తావుండదు. అంతిమంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

- వెంకటేశ్‌, జగిత్యాల అర్బన్‌ తాసిల్దార్‌