గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:27:34

హెటిరో హరితంలో మేటిరో

హెటిరో హరితంలో మేటిరో

 • మంబాపూర్‌-నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని
 • దత్తత తీసుకున్న హెటిరో చైర్మన్‌ పార్థసారథిరెడ్డి
 •  గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితోనేనని వెల్లడి
 • 2,543 ఎకరాల అడవి అభివృద్ధికి ప్రణాళిక
 • రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల చెక్కు అందజేత

నెర్రెబారిన తెలంగాణ భూమికి ఆకుపచ్చని రంగేయాలన్నది ఒకరి లక్ష్యం.. ప్రజల్లో చైతన్యం కలిగించి ఒక్కో మొక్కను నాటించి పచ్చదనాన్ని పెంచాలన్నది మరొకరి చాలెంజ్‌.. ఆ లక్ష్యం ఎంత గొప్పదో, ఆ చాలెంజ్‌ ఎంత శక్తిమంతమైనదో మరోసారి రుజువైంది. మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, నేలతల్లికి హరితహారాన్ని తొడుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గ్రీన్‌సవాల్‌ విసురుతున్న రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌కు మరొకరు తోడయ్యారు. ఫార్మా దిగ్గజం హెటిరో చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి.. నేను సైతం అంటూ హరిత తెలంగాణ కోసం నడుం బిగించారు.    

గ్రీన్‌ చాలెంజ్‌ స్ఫూర్తితో హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనం పెంపు-అటవీ ప్రాంతాల రక్షణ, అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్‌- నల్లవెల్లి అటవీప్రాంతాన్ని ఆయన సోమవారం దత్తత తీసుకున్నారు. అందుకు సంబంధించిన రూ.5 కోట్ల చెక్కును పార్థసారథి ప్రభుత్వానికి అందజేశారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆయన మంబాపూర్‌- నల్లవెల్లిలో అటవీ అభివృద్ధికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. 


గ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో ఎంపీ సంతోష్‌కుమార్‌ కృషి తమను ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్ధికి సంకల్పించామని తెలిపారు. హెటిరో డ్రగ్స్‌ చొరవను సంతోష్‌ అభినందించారు. ఇటీవల హీరో ప్రభాస్‌, ఇప్పుడు హెటిరో డ్రగ్స్‌ పర్యావరణ స్ఫూర్తితో ముందడుగు వేయటం అభినందనీయమన్నారు. మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కూడా ముందు కు వస్తున్నారని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జీ మహిపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనం విస్తరించాలని..

 • హైదరాబాద్‌ శివారు నర్సాపూర్‌ రోడ్డులో ఉన్న మంబాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ మూడు కంపార్ట్‌మెంట్లలో విస్తరించింది. దీనిలో మంబాపూర్‌ (1777 ఎకరాలు), నల్లవెల్లి (766 ఎకరాలు) మొత్తం కలిపి 2,543 ఎకరాల అటవీ భూమి ఉన్నది. ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. 
 • గుండ్లపోచంపల్లి, దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ అటవీ ప్రాంతం ఉన్నది. ఇటీవల నర్సాపూర్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఈ అటవీప్రాంతాన్ని రక్షణాత్మక చర్యల ద్వారా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 
 • ఔటర్‌ పక్కన విస్తరిస్తున్న ప్రాంతాలతోపాటు, సమీప గ్రామాలకు, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌, పారిశ్రామికవాడలకు, నర్సాపూర్‌-మెదక్‌-బోధన్‌ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. 
 • విషయం తెలుసుకున్న హెటిరో డ్రగ్స్‌.. ఈ అటవీప్రాంత అభివృద్ధికి ముందుకొచ్చింది.
 • పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయి. గ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో ఎంపీ సంతోష్‌కుమార్‌ చేస్తున్న కృషి నన్ను ఆకర్షించింది. అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకొని అభివృద్ధికి సంకల్పించాను.

- హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ , డాక్టర్‌ పార్థసారథి రెడ్డి

మారనున్న అడవి స్వరూపం

హెటిరో డ్రగ్స్‌ అందించిన నిధులతో నర్సాపూర్‌ రహదారి పక్కనే ఉన్న మంబాపూర్‌ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును అభివృద్ధి చేయనున్నారు. 

2,543 ఎకరాలు

 • అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా సుమారు 25 కిలోమీటర్ల పరిధిలో ఫెన్సింగ్‌ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజంగా అడవిని పునరుద్ధరించనున్నారు.
 • నర్సాపూర్‌ రోడ్డు నుంచి అడవిలోకి ప్రవేశించిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో చుక్క గుట్ట అనే కొండ (సుమారు 630 మీటర్ల ఎత్తు) ప్రాంతం ఉన్నది. 
 • అక్కడ వ్యూ పాయింట్‌ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్‌, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదన ఈ అడవి పచ్చని ప్రకృతితోపాటు, అరుదైన వృక్షజాతులకు, వన్యప్రాణులకు నెలవుగా ఉన్నది. తగిన రక్షణ చర్యలు తీసుకుంటే ఈ జంతువుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
 • హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథి చొరవను అభినందిస్తున్నా.

మొన్న హీరో ప్రభాస్‌, ఇప్పుడు హెటిరో డ్రగ్స్‌ పర్యావరణ స్ఫూర్తితో ముందడుగు వేయటం మంచి పరిణామం. అడవులను దత్తత తీసుకొనేందుకు మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.

-  రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌


logo