e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides రాహుల్‌ మెడకు రేవంత్‌ ఉచ్చు

రాహుల్‌ మెడకు రేవంత్‌ ఉచ్చు

  • ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా ‘రాహుల్‌ డ్రగ్‌ టెస్ట్‌’
  • ఓటుకు నోటుతో బాబుకు.. డ్రగ్స్‌తో రాహుల్‌కు.. 10 జన్‌పథ్‌కు తలనొప్పిగా రేవంత్‌ వ్యవహారం
  • శశిథరూర్‌పై వ్యాఖ్యలతో ఇప్పటికే సీనియర్ల గుర్రు.. రేవంత్‌కు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): ‘తాచెడ్డ కోతి.. వనమెల్ల చెరిచిన్నట్టు’ ఉంటుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారం. నాడు ఓటుకు నోటుతో టీడీపీని నిలువునా ముంచిన రేవంత్‌.. ఇప్పటికే జవసత్వాలు లేక చచ్చుపడిపోయిన కాంగ్రెస్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ మెడకు రేవంత్‌ ఉచ్చు బిగిస్తున్నారు. పనికిరాని ప్రేలాపనలతో ‘బూమరాంగ్‌’లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి అధిష్ఠానానికి కొత్త చిక్కులు తెస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను గాడిద అంటూ తిట్టడం, తాజాగా మంత్రి కేటీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణలు. రాహుల్‌ గాంధీని డ్రగ్స్‌ వ్యవహారంలోకి పరోక్షంగా లాగి అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేశారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రోజుకో తలనొప్పి తెస్తున్నారని 10 జన్‌పథ్‌ ఆగ్రహంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

ట్విట్టర్‌ టాప్‌ ట్రెండింగ్‌
దమ్ముంటే రాహుల్‌గాంధీకి డ్రగ్స్‌ టెస్ట్‌ చేయించాలన్న మంత్రి కేటీఆర్‌ సవాల్‌ సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘#రాహుల్‌డ్రగ్‌టెస్ట్‌’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌గా నిలిచింది. ట్విట్టర్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ట్రెండ్‌ అయ్యింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో 10 వేలకుపైగా ట్వీట్లు నమోదవడం విశేషం. బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్యస్వామి గతంలో రాహుల్‌గాంధీ, రాబర్ట్‌వాద్రాకు(ప్రియాంక గాంధీ భర్త) డ్రగ్స్‌ వాడకంపై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌చేయగా, తాజాగా రేవంత్‌ మళ్లీ వివాదానికి కారకుడయ్యారు. ‘రాహుల్‌ తన వెంట్రుకలను, గోళ్లను టెస్ట్‌లకు ఎప్పుడు ఇస్తున్నారు?’, ‘రాహుల్‌.. చాలెంజ్‌ను యాక్సెప్ట్‌ చెయ్యి’అంటూ ట్వీట్ల వర్షం కురిసింది. దీంతో రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అధినాయత్వం అసహనంతో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ‘నా స్థాయి చంచల్‌గూడ జైలు నుంచి వచ్చిన క్రిమినల్‌ది కాదు.. మీ పార్టీ అధ్యక్షుడి స్థాయి’ అంటూ కేటీఆర్‌చేసిన వ్యాఖ్యలపైనా ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోలింగ్‌ నడుస్తున్నది. జైలు నుంచి వచ్చిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చారంటూ కాంగ్రెస్‌ను సైతం ఓ ఆటాడుకొంటున్నారు.

- Advertisement -

బూమరాంగ్‌ ట్వీట్‌
రేవంత్‌రెడ్డి వైట్‌చాలెంజ్‌ పేరుతో చేసిన ఓ ట్వీట్‌ బూమరాంగ్‌ అయ్యింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన చాలెంజ్‌ను స్వీకరించాడంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్‌ చేస్తూ, గుజరాత్‌లో 2,988 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారని, మరో బోట్‌లో 30 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారని వచ్చిన వార్తలను జతచేశారు. ఈ రెండు వార్తలకు తెలంగాణతో సంబంధమే లేదు. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ‘అయ్యా.. ఓటుకు నోటు దొంగ. నువ్వు పెట్టిన పోస్టు గుజరాత్‌లో జరిగిన సంఘటన. తెలంగాణకు ఏం సంబంధం? అందుకే సదువుకో అనేది. నువ్వు మా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావడం మా దౌర్భాగ్యం’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘చాలెంజ్‌ అంటే సమఉజ్జీలతో ఉండాలి. నీ చాలెంజ్‌.. దొంగ, పైరవీకారు, బ్లాక్‌మెయిలర్‌ చంచల్‌గూడ జైలులోని నీ స్నేహితులతో ఉండాలి’ అని మరో నెటిజన్‌ ఘాటుగా స్పందించారు. రాహుల్‌ డ్రగ్‌టెస్ట్‌ హ్యాష్‌ట్యాగ్‌పై సోషల్‌మీడియాలో మీమ్‌లు సైతం వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ తదితరుల ఫొటోలతో, ఫన్నీ క్యాప్షన్స్‌తో చేసిన మీమ్‌లు వైరల్‌గా మారాయి. రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచిన మాజీ మంత్రి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని సైతం నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ‘ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మాట్లాడిన రెండు జాతీయ పార్టీల తెలంగాణ మీడియేటర్‌ విశ్వేశ్వర్‌రెడ్డిని అడుగుతున్నా.. నీ కొడుకుకి డ్రగ్‌ టెస్ట్‌ చేయించే దమ్మున్నదా? మొదలు నీ కొడుకుకి టెస్ట్‌ చేయించి పాజిటివ్‌ రాకపోతే అప్పుడు మాట్లాడు చూసుకుందాం’ అని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సతీశ్‌రెడ్డి ట్వీట్‌చేశారు. వైట్‌చాలెంజ్‌ను స్వీకరించాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోరడంపై కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. కాంగ్రెస్‌-బీజేపీల బంధం దృఢమైందని తేలిపోయిందని, తెలంగాణాలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలను వేర్వేరుగా చూడలేమంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపించాయి.

కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పార్టీకి దూరం
పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ జగ్గారెడ్డి ఇటీవల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ప్రతి శనివారం జరిగే పార్టీ పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీ సమావేశాలను ఆయన బాయ్‌కాట్‌ చేసిన విషయం తెలిసిందే. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా తనను అధిష్ఠానం నియమించినప్పటికీ సమావేశానికి ఆహ్వానించకపోవడం పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీపీసీసీ అధ్వర్యంలో గజ్వేల్‌లో నిర్వహించిన సభకు కూడా హాజరుకాలేదు. నిరుద్యోగ సమస్యలపై ప్రజాసంఘాలతో కలిసి ఆందోళనకు హాజరైన కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి వైఖరితో విసిగిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తన నియోజకవర్గంలోని బండి రావిర్యాలలో సోమవారంనాటి ధర్నాను పార్టీపరంగా కాకుండా సొంతంగా నిర్వహించడం కలకలం రేపింది.

ఏ పార్టీలో ఉన్నా ఢమాల్‌
రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా అది ఢమాల్‌ కావడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇలాగే పార్టీ అధినేత చంద్రబాబును ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అదేమాదిరిగా తాజాగా డ్రగ్స్‌ వివాదంలోకి రాహుల్‌ గాంధీని అనవసరంగా లాగారని ఆ పార్టీలో సీనియర్లు వాపోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు శశిథరూర్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి శశిథరూర్‌ను గాడిదతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేయడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు కోరాల్సి వచ్చింది. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో కోవర్టులున్నారని చేసిన వ్యాఖ్యలూ పెద్ద దూమారం రేపాయి. రేవంత్‌ వైఖరి, ఒంటెత్తు పొకడలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉన్నాయని నివేదికలు అందడంతో ఆయనకు చెక్‌ పెట్టేలా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కమ్‌ ఠాగూర్‌ చైర్మన్‌గా రాజకీయ వ్యవహారాల కమిటీని అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement