గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:17

తిరిగొస్తున్న బీహార్‌ కూలీలు

తిరిగొస్తున్న బీహార్‌ కూలీలు

  • లాక్‌డౌన్‌తో స్వరాష్ర్టానికి వెళ్లిన కార్మికులు 
  • ఉపాధి కోసం తిరిగొస్తున్న బీహారీలు
  • బస్సులు ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:లాక్‌డౌన్‌ సమయంలో స్వరాష్ర్టాలకు వెళ్లేందుకు వలస కార్మికులకు ఉచిత రవాణా ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం వారు తిరిగి తెలంగాణకు రావాలనుకుంటున్నామని తెలుపగానే మళ్లీ వారికోసం బస్సులు పంపించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇక్కడ పనులు లేకపోవడంతో ఆయా రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు తమ స్వరాష్ర్టాలకువెళ్లిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో కూడా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలంంగాణ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారికోసం సంగారెడ్డి జిల్లా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి తిరిగివచ్చే ఏర్పాట్లు చేశారు. బీహార్‌లోని సుపాల్‌ జిల్లాకు చెందిన కార్మికులు సంగారెడ్డి జిల్లాలోని అందోలు, హత్నూర మండలాల్లోని రైస్‌ మిల్లుల్లో పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో రైసుమిల్లులు మూతపడటంతో వీరు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.

ఈలోగా పంటలు కోతకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి భారీ స్థాయిలో పంటలను ధాన్యం కొనుగోలుచేసింది. ఈ ధాన్యాన్ని ప్రస్తుతం బియ్యం నూర్పిడికోసం రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. కార్మికులు లేకపోవడంతో మిల్లుల్లో బియ్యం నూర్పిడి ఇబ్బందిగా మారింది. కార్మికుల కొరతపై అధికారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే బీహార్‌ వెళ్లిన కార్మికుల నుంచి వీరికి ఫోన్లు వచ్చాయి. తాము తిరిగి తెలంగాణకు వస్తామని, తీసుకువెళ్లాలని పలువురు కార్మికులు విజ్ఞప్తిచేశారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు బస్సులు ఏర్పాటుచేసి కార్మికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డిని ఆదేశించారు. దీనితో రెండు బస్సులను ఇక్కడి నుంచి సుపాల్‌ పంపించారు. శుక్రవారం సాయంత్రం సుపాల్‌ నుంచి 40 మంది కార్మికులు సంగారెడ్డికి బయలుదేరారు. శనివారం ఉదయం మరో 40 మందితో ఇంకో బస్సు బయలుదేరనున్నది.

స్వస్థలాలకు 3 లక్షల మంది 

ఇప్పటిదాకా మూడు లక్షలమందికి పైగా వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం వెల్లడించింది. మే 1న శ్రామిక్‌ రైళ్లు ప్రారంభమయ్యాయని, శుక్రవారం నాటికి మొత్తం 235 రైళ్లను నడిపామని తెలిపింది. ఇందులో అత్యధికంగా 146 సర్వీసులు తెలంగాణ నుంచి నడిచాయి. వీటిద్వారా 1.87 లక్షల మంది కార్మికులు స్వరాష్ర్టాలకు వెళ్లారని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు.


logo