ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 02:33:44

గొర్ల సంపదలో తెలంగాణ ఫస్ట్‌

గొర్ల సంపదలో తెలంగాణ ఫస్ట్‌

 • 1.91 కోట్ల గొర్రెలతో దేశంలోనే మొదటిస్థానం
 • ఫలించిన గొర్రెల పంపిణీ పథకం 
 • రూ.5 వేలకోట్ల సంపద సృష్టి 
 • రెండేండ్లలో రెట్టింపైన గొర్రెలు 
 • యానిమల్‌ లైవ్‌స్టాక్‌ సెన్సెస్‌లో వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలిస్తున్నది. గొర్రెల సంపదలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 1.91కోట్ల గొర్రెల సంఖ్యతో సరికొత్త ఘనత సాధించింది. గొర్రెల సంఖ్య పెరుగుదల శాతంలోనూ జాతీయస్థాయిలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది. దేశవ్యాప్తంగా జంతువుల సంఖ్యపై నిర్వహించిన 20వ యానిమల్‌ లైవ్‌స్టాక్‌ సెన్సెస్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక సోమవారం విడుదలైంది. 2012 సెన్సెస్‌ ప్రకారం రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు మాత్రమే. ఈ మధ్యకాలంలో 48.51 శాతం పెరుగుదల నమోదుకావడం మరో రికార్డు. గొర్రెల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక.. రెండు, మూడోస్థానంలో నిలిచాయి. 

రెండుకోట్లకు చేరువలో..

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో గొర్రెల పెరుగుదల నమోదైంది. ఏడేండ్లలో 63 లక్షల గొర్రెలు పెరిగాయి. ఈ పెరుగుదలలో మెజార్టీ శాతం గత రెండేండ్లలోనే నమోదుకావడం గమనార్హం. 2017కు ముందు తెలంగాణలో గొర్రెల సంఖ్య కోటిలోపే ఉన్నది. 2019 లెక్కల ప్రకారం ఆ సంఖ్య రెండు కోట్లకు చేరువైంది. ప్రస్తుతం గొర్రెల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. మరే రాష్ర్టానికి సాధ్యంకాని విధంగా 48.51 శాతం పెరుగుదల నమోదుకావడం గమనార్హం. మరే రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదు. ఏపీలో 30 శాతం, కర్ణాటకలో 15.31 శాతం పెరుగుదల నమోదైంది. 

ఫలించిన ప్రభుత్వం కృషి

తెలంగాణలోని గొల్ల కురుమలను దేశంలోనే ధనిక గొల్ల కురుమలుగా మార్చ డం, మాంసం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాన్నిచ్చింది. ఈ పథకమే ఇప్పుడు తెలంగాణను దేశంలో మేటిగా నిలిపిందనడంలో సందేహం లేదు. రెండు,మూడేండ్లలో మాంసం ఎగుమతుల ద్వారా రూ.5 వేలకోట్ల సంపదను సృష్టించగలింది. 

జంతువుల సంఖ్యలో రెండోస్థానం

గొర్రెల సంఖ్యలో మొదటిస్థానంలో నిలిచిన తెలంగాణ.. మొత్తం జంతువుల సంఖ్యలో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. జంతువుల సంఖ్య పెరుగుదలలో మాత్రం రెండోస్థానంలో నిలువడం విశేషం. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల జంతువులు ఉన్నట్టు 20వ లైవ్‌స్టాక్‌ సెన్సెస్‌లో తేలింది. 2012లో ఈ సంఖ్య 2.67 కోట్లు మాత్రమే. జంతువుల సంఖ్యలో 22.21 శాతం పెరుగుదల నమోదైంది. 

ఫలితాలిస్తున్న కేసీఆర్‌ నిర్ణయాలు  ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ 

గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంపొందించడానికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మాంసం, చేపల ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అగ్రభాగాన ఉందన్న కేంద్ర నివేదికపై  మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విట్టర్‌లో స్పందించారు. 

ఇవీ గొర్రెల సంపద లెక్కలు.. 

 • 2012లో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు 
 • 2019లో గొర్రెల సంఖ్య 1.91 కోట్లు 
 • పెరుగుదల శాతం 48.51
 • పెరుగుదల శాతంలోనూ తెలంగాణ ఫస్ట్‌ 
 • గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం: 2017 సంవత్సరంలో
 • ఒక వ్యక్తికి (ఒక యూనిట్‌) ఇచ్చిన గొర్రెల సంఖ్య: 21 (20 ఆడ. 1 మగ గొర్రె)
 • యూనిట్‌ ఖర్చు రూ.1.25 లక్షలు
 • లబ్ధిదారుల సంఖ్య: 3.65 లక్షలు
 • ప్రభుత్వం వెచ్చించినది: రూ.3,313 కోట్లు 

ప్రభుత్వ కృషి ఫలితమే

గొర్రెల సంఖ్యలో తెలంగాణ మొదటిస్థానంలో నిలువడం సంతోషకరం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ పథకం వల్ల తెలంగాణలో మాంసం ఉత్పత్తుల సంపద కూడా భారీగా పెరిగింది.

- లక్ష్మారెడ్డి, డైరెక్టర్‌, పశుసంవర్ధక శాఖ


logo