శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 02:13:56

నాలాల పునరుద్ధరణ.. కబ్జాల తొలగింపు

నాలాల పునరుద్ధరణ.. కబ్జాల తొలగింపు

  • l జీహెచ్‌ఎంసీలో ముంపు  సమస్యకు పరిష్కారమిదే
  • l 185 చెరువుల మధ్య సాంకేతిక అనుసంధానం
  • l ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు   వినోద్‌తో ఇంజినీర్లు, నిపుణులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాలాలను పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించడం ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని, తద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు ఇంజినీర్లు, నిపుణులు అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ సహా శివారు ప్రాంతాల్లోని 185 చెరువులను సాంకేతిక పరిజ్ఞానంతో లింక్‌ చేయడం ద్వారా వరదను మళ్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ముంపు సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఇంజినీర్లు, ఆయా రంగాల నిపుణులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో శనివారం సమావేశమయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో 45% కాలనీలు మొదటిసారిగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. మరో 35% కాలనీలు రెండు, మూడోసారి, మిగతా 10% కాలనీలు పలుమార్లు ముంపునకు గురయ్యాయని ఈ సర్వేలో వెల్లడైందని ఇంజినీర్లు తెలిపారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌ వరదనీటిని మూసీ నది పరీవాహక ప్రాంతంతో అనుసంధానం చేయడం, ఆక్రమణలు తొలగించడంతోనే ముంపు సమస్య రాదని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. మూసీ నీటిని ప్రత్యేక ప్లాంట్ల ద్వారా నిరంతరం శుద్ధి చేసి, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వరద నీటిని కింది భాగానికి తరలిస్తే బాగుంటుందని పలువురు సూచించారు. హైదరాబాద్‌ వరద నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు వారు తెలిపారు. ఈ భేటీలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జీ రామేశ్వరరావు, కార్యదర్శి అంజయ్య, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (కరీంనగర్‌) అనిల్‌కుమార్‌, రిటైర్డ్‌ సీఈ సత్తిరెడ్డి, వరంగల్‌ నిట్‌ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీజీ శాస్త్రి, జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ (చెరువులు) శేఖర్‌రెడ్డి, ఓయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి గోపాల్‌నాయక్‌, జేఎన్టీయూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ సాయిబాబారెడ్డి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణరావు, ప్రొఫెసర్లు అనురాధరెడ్డి, సురేష్‌కుమార్‌, శ్రీనివాస్‌కుమార్‌,ప్రదీప్‌కుమార్‌, రమణనాయక్‌, నీరి డైరెక్టర్‌ డాక్టర్‌ షేక్‌ బాబా, తదితరులు పాల్గొన్నారు.