ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 16:23:45

' పూరి గుడిసెల్లోని నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారు'

' పూరి గుడిసెల్లోని నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారు'

సిద్దిపేట : నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనీలో 20 డబుల్  బెడ్ రూమ్ గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు గృహ పత్రాలను అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిరుపేదలకు నిలువెత్తు గౌరవం ఇవాళ నాంచారుపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లు పూరి గుడిసెల్లో నివసించిన నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారని పేర్కొన్నారు. గంగిరెద్దుల వాళ్ల అభ్యున్నతికి ఏంబీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందేలా కృషి చేస్తానన్నారు. నిజంగా అత్యంత నిరుపేదలకు పిట్టలోళ్లు, పూసలోళ్లు, హోలియ దాసరి, గంగిరెద్దుల ఇలా.. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాం. ఇంకా కూడా ఇస్తామని స్పష్టం చేశారు.


అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని,  మిగిలి పోయిన పేదవారికి కూడా మరిన్ని ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పెన్షన్లు  పెంచారని గుర్తు చేశారు.  గ్రామ యువత ముందుకొస్తే.. న్యాక్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి చూపిస్తానని గంగిరెద్దుల కులస్తులకు మంత్రి భరోసానిచ్చారు.

మీ కాళ్లకు మట్టి అంటకుండా మీ గ్రామంలో సీసీ రోడ్ల కోసం రూ.10లక్షలు నిధులు వారం రోజుల్లో మంజూరు చేస్తానని హామీనిచ్చారు. గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా వరమిచ్చారని సంబురంతో.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు పది కాలాలు సల్లంగా ఉండాలని ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీ వాసులు దీవెనలు ఇచ్చారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ కల్పన, పంచాయతీ రాజ్ డీఈ వేణు, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
logo