మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:12:41

భూ సమస్యలపై కసరత్తు!

భూ సమస్యలపై కసరత్తు!

  • కోర్టు కేసులు, పార్ట్‌-బీ నివేదికలు సిద్ధం
  • త్వరలో పెండింగ్‌ మ్యుటేషన్ల పరిష్కారం

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధిం చిన అన్ని రకాల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ధరణిని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌తోపాటు అదనంగా అనేక ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. తాజా గా కోర్టు కేసుల వివరాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చింది. మరిన్ని ఆప్షన్ల కూడా కృషి జరుగుతున్నది. పార్ట్‌-బీ, కోర్టు కేసుల్లోని భూములు, సాదాబైనామా, పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులను క్లియర్‌పైనా యంత్రాం గం దృష్టి పెట్టింది. 

మండలాలవారీగా నివేదికలు

భూ సంబంధ పెండింగ్‌ సమస్యలపై మండలాలవారీగా నివేదికలు సిద్ధం కానున్నాయి.  మండలాలవారీగా పార్ట్‌-బీ, పెండింగ్‌ మ్యుటేషన్లు, సివిల్‌, రెవెన్యూ కోర్టుల్లోని కేసులు, ఇతర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించే పనిలో తాసిల్దార్లు ఉన్నారు.

పెండింగ్‌ మ్యుటేషన్లకు కార్యాచరణ

పెండింగ్‌ మ్యుటేషన్లను పూర్తికి ఇప్పటికే ధరణిలో అవకాశం కల్పించారు. పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని త్వరలో పరిష్కరించనున్నారు. ఇప్పటికే దరఖాస్తులన్నీ కలెక్టర్ల వద్దకు చేరాయి. వీటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత తాసిల్దార్ల వద్దకు చేరనున్నాయి. అనంతరం వినియోగదారులు స్లాట్‌ బుక్‌ చేసుకొని, నిర్దేశిత మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే తాసిల్దార్లు మ్యుటేషన్‌ పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించినట్టు సమాచారం.

డివిజన్‌కు ఒక గ్రామం శాంపిల్‌

క్షేత్రస్థాయిలో ధరణిసమస్యలను తెలుసుకొనేందుకు శాంపిల్‌ సర్వే చేసినట్టు తెలిసింది. రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామాన్ని ఎంచుకొని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటి పరిష్కారానికి ధరణిలో ఆప్షన్లు ఉన్నాయా? ఏయే సమస్యలకు కొత్త ఆప్షన్లు అవసరం? వంటి వివరాలపై సర్వే నిర్వహించినట్టు సమాచారం. సమగ్ర వివరాలు కలెక్టర్ల వద్దకు చేరాయి. ఇటీవలి టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు ఆ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు తెలిసింది. ఈ నివేదికల ఆధారంగా ధరణిని మరింత మెరుగుపరచనున్నారు.