శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 18:53:24

టీఆర్ఎస్‌లో చేరిన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామాల‌వాసులు

టీఆర్ఎస్‌లో చేరిన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామాల‌వాసులు

సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని మ‌ల్ల‌న్న సాగ‌ర్ ముంపు గ్రామాలు ప‌ల్లెప‌హాడ్‌, వేములఘాట్‌, రాంపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు నివాసంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వీరంద‌రికీ మంత్రి గులాబీ కండువాలు క‌ప్పి సాధ‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయి. మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ పూర్తికావు, నీళ్లు రావు అన్నారు. రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటారు అని విమర్శించారు. ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నం.

కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించామో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా అదేవిధమైన స‌హాయం అందిస్తాం. కాంగ్రెస్, బీజేపీల‌ చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు. ప్రాజెక్టు కడుతున్నాం అంటే ముంపు గ్రామంగా ముందు ఉంది రాంపూర్ గ్రామం. మీ త్యాగం గొప్పది. మిమ్మల్ని ప్రభుత్వం ఎప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. నాడు ప్రాజెక్టుకు ముందుకు కొచ్చారు. నేడు పార్టీ గెలుపుకు ముందు ఉంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న‌ట్లు హ‌రీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.