గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:42

డివిజన్లు మారవు

డివిజన్లు మారవు

  • రిజర్వేషన్లు కూడా యథాతథం
  • అసత్య వార్తలు నమ్మొద్దు: బల్దియా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని, ఎన్నికలపై గందరగోళం సృష్టించేలా వస్తున్న వార్తలను విశ్వసించవద్దని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశంపై కొన్ని పత్రికల్లో వస్తున్న అసత్య కథనాలను ఆయన ఖండిస్తూ, అలాంటి వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జీహెచ్‌ఎంసీలో 2016 ఎన్నికల సందర్భంగా అమలుచేసిన డివిజన్లు, రిజర్వేషన్లలో ఈసారి కూడా ఎలాంటి మార్పులు ఉండవని, అవి యథావిధిగా కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి ఈ ఏడాది జరిగిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ఆధారంగా ఓటర్ల జాబితా రూపొందించనున్నామని, వాటి ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేంతవరకు ఓటరుగా పేరు నమోదుకు అవకాశం ఉన్నదని, అప్పటివరకు నమోదుచేసుకున్నవారికి ఓటుహక్కు లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి వార్డులు, పోలింగ్‌స్టేషన్లవారీగా ఓటరు జాబితా రూపొందిస్తామని వివరించారు.