బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 02:41:32

ప్రైవేటు దవాఖానల్లో పడకల రిజర్వేషన్‌

ప్రైవేటు దవాఖానల్లో పడకల రిజర్వేషన్‌

  • ప్రీ-బుకింగ్‌ చేసుకుంటున్న అతి జాగ్రత్తపరులు
  • కరోనా వస్తే దొరకవేమోనని అనుమానం
  • ఇదే అదనుగా హౌస్‌ఫుల్‌ అంటున్న హాస్పిటల్స్‌
  • అడ్మిట్‌ కావాలంటే భారీగా ఇచ్చుకోవాల్సిందే

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేకమంది భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌ తమకెక్కడ సోకుతుందోనన్న భయం పలువురిని పీడిస్తున్నది. దీంతో డబ్బున్నవారు ముందుజాగ్రత్తగా ప్రైవేటు దవాఖానల్లో గదులను, పడకలను రిజర్వు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా పలు కార్పొరేట్‌ దవాఖానలు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తూ పడకలు లేవంటూ రోగులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కొన్ని దవాఖానలు గేటు వద్ద ఏకంగా ‘హౌస్‌ఫుల్‌' బోర్డు పెడుతున్నాయి. 

హైదరాబాద్‌లో భారీగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రైవేటు దవాఖానలు తమ వద్ద పడకలు దొరకడం లేవనే ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని దవాఖానల యాజామాన్యలు తమ వద్ద పడకలు లేవని, ఖాళీ అయిన వెంటనే చేర్చుకుంటామంటూ ముందుగానే అడ్వాన్స్‌ తీసుకుంటున్నాయి. సకల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలపై సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం కూడా కొందరు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతున్నది. కొంతమంది సంపన్నులు తమకు వైరస్‌ సోకకపోయినా.. ముందుజాగ్రత్తగా గదులు, పడకలను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది.

కొన్ని దవాఖానలు ఉన్నతస్థాయి సిఫారసులు ఉంటే తప్ప సామాన్యులకు పడకలు ఇవ్వడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో విదితమవుతున్నది. సినిమా హాళ్లను తలదన్నేలా.. కొన్ని దవాఖానలు ‘హౌస్‌ఫుల్‌' బోర్డులు పెడుతుండగా.. కొందరు రోగులు పడకల కోసం బ్లాక్‌లో బేరమాడే పరిస్థితి కూడా దాపురించింది. సర్కార్‌ దవాఖానల్లో అనుభవజ్ఞులైన వైద్యసిబ్బంది, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నా కొంతమంది కేవలం భయాందోళనలతోనే ప్రైవేటు దవాఖానలవైపు పరుగెత్తుతూ చేతి చమురు వదిలించుకుంటున్నారు.  ప్రైవేటు దవాఖానల్లో చేరుతున్న కొవిడ్‌ రోగుల్లో 80 శాతం మందికి ఎటువంటి రోగ లక్షణాలు లేవని తెలుస్తున్నది. 

బ్లాక్‌లో బెడ్లు

కరోనా రోగుల చికిత్సకు తాము ఖరారు చేసిన చార్జీలనే వసూలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో కొన్ని దవాఖానలు బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే రెండు రెట్లు అధికంగా చెల్లించి వైద్యం పొందుతున్నట్టు పలువురు రోగులు ఆరోపించారు. ఉదాహరణకు కొవిడ్‌ రోగి చికిత్సకు సంబంధించి వ్యక్తిగత గది రూ.5వేలు ఉంటే బ్లాక్‌లో రూ.10వేల నుంచి రూ.15వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. తమ వారిని బతికించుకొనేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా బ్లాక్‌లో పడకలు లేదా గదులను బుక్‌చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. 

సర్కార్‌ దవాఖానల్లో అన్నీ అందుబాటులో

కొవిడ్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదు. కేవలం సపోర్టింగ్‌ ట్రీట్‌మెంట్‌ మాత్రమే అందిస్తారు. అత్యవసరమైన వారికి ఐసీయూలో ఆక్సిజన్‌ లేదా వెంటిలెటర్‌ అమర్చాల్సి ఉంటుంది. కేవలం 10శాతం మందికి మాత్రమే ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ అవసరమవుతాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈనెల ఒకటో తేదీ నాటికి 9008 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో దాదాపు 7వేల నుంచి 8వేల మంది రోగులు హోమ్‌ ఐసొలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. గాంధీ దవాఖాన సామర్ధ్యం 2000 పడకలు కాగా అందులో ఉన్నది సుమారు 700 మంది రోగులు మాత్రమే. ఇంకా 1300 పడకలు ఖాళీగానే ఉన్నాయి. కింగ్‌కోఠి దవాఖానలో 350పడకలు అందుబాటులో ఉండగా అందులో ప్రతిరోజు సుమారు 50 పకడలు, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో 10పడకల వరకు ఖాళీగా ఉంటాయని అధికారులు తెలిపారు.  ప్రతిరోజు 900నుంచి వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నా 700 నుంచి 800మంది ప్రతిరోజు డిశ్చార్జ్‌ అవుతున్నారు. 

కఠిన చర్యలు తప్పవు

‘ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురవుతున్నారు. కరోనా విషయంలో భయపడడం కాదు జాగ్రతగా ఉండడం ముఖ్యం. చికిత్స కంటే నియమాలు పాటించడం అత్యవసరం. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా మందులను అందచేస్తున్నది. ప్రతి నిత్యం స్థానిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులు వారి పరిధిలోని హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షిస్తున్నారు. మందులు తదితరాలను ఏఎన్‌ఎంల ద్వారా రోగుల ఇంటికే నేరుగా పంపుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ల్యాబ్‌లు, హాస్పిటల్స్‌పై కఠినచర్యలు తప్పవు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఇప్పటికే ఏడు ప్రైవేటు దవాఖానలు, ల్యాబ్‌లకు నోటీసులు జారీచేశాం. ఒక దవాఖానను సీజ్‌ చేశాం. 

- డాక్టర్‌ ఎస్డీ రామ్‌కుమార్‌ , మేడ్చల్‌ జిల్లా సర్వేలెన్స్‌ అధికారి


logo