ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:24:13

బీటీ ప్రత్యామ్నాయం సూటి

బీటీ ప్రత్యామ్నాయం సూటి

  • మరో మూడేండ్లలో అందుబాటులోకి విత్తనాలు
  • అగ్రి వర్సిటీ పరిశోధనలతో సత్ఫలితాలు

ఆదిలాబాద్‌, జనవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పత్తి రైతులకు మంచి విత్తనాలు అందించేందుకు నాన్‌బీటీ సూటి రకాల్లో బీటీ జన్యువును ప్రవేశపెట్టి మేలు రకమైన విత్తనోత్పత్తి దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధన స్థానంలో నాలుగేండ్లుగా జరుపుతున్న పరిశోధనల్లో బీటీ విత్తనాలకు సమానంగా ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండుమూడేండ్లలో ఈ విత్తనాలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. పత్తి రైతులు గతంలో కాయతొలిచే పురుగు వల్ల బాగా నష్టపోయేవారు. పంట కాయదశలో ఉన్నప్పుడు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగులు ఆశించడంతో సాగు భారంగా ఉండేది. ఈ సమస్య పరిష్కారం కోసం వివిధ విత్తన కంపెనీలు 14 సంవత్సరాలుగా బీటీ పత్తి విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రైతులు కొన్నేళ్లుగా వీటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వందల విత్తన కంపెనీలు బీటీ విత్తనాలను తయారు చేస్తున్నాయి. 450 గ్రాముల బరువు ఉండే ఈ విత్తనాల ప్యాకెట్‌ను రూ.720కి విక్రయిస్తారు. ఎకరం పంట సాగు కోసం రెండు ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో రైతు 3 నుంచి 10 ఎకరాల వరకు సాగు చేస్తారు. అధిక ధరలతో బీటీ విత్తనాలు కొనుగోలు చేసిన ఏదీ అసలు, ఏదీ నకిలీ తెలియడం లేదు. గ్రామాల్లో కొందరు వ్యాపారులు, దళారులు రైతులను మభ్యపెట్టి బీటీ పేరిట నకిలీ విత్తనాలు తక్కువ ధరకు అంటగడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో పత్తి పంటకు తెగుళ్లు రావడం, దూదిపింజ పొడువు తగ్గిపోవడంతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు క్వింటాలుకు రూ.100కు తగ్గించారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. బీటీకి ప్రత్యామ్నాయంగా బీటీ పత్తి సూటి రకాలను తయారు చేసేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. 

సత్ఫలితాలిస్తున్న పరిశోధనలు

ఆదిలాబాద్‌ జిల్లాలో లభించే పత్తి విత్తనాలు సూటి రకాల్లో దూదిపింజ పొడవు ఉండే ఈజిప్ట్‌ కాటన్‌, దిగుబడి ఎక్కువగా ఉండే అమెరికా కాటన్‌ బీటీ జన్యువును చొప్పిస్తారు. నాలుగేండ్లుగా జిల్లాలో బీటీ జన్యువులు చొప్పించిన విత్తనాలతో పరిశోధన కేంద్రంలో సాగు చేస్తున్నారు.ఇక్కడ తయారు చేసిన సూటి రకాల విత్తనాలు, బీటీ విత్తనాలతో సమాన ఫలితాలు ఇస్తున్నాయని, దిగుబడి ఎకరానికి 10- 12 క్వింటాళ్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పంటలో కాయ తొలిచే లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ప్రభావం కనిపించడం లేదని తెలిపారు. మరో మూడేండ్లలో పూర్తిస్థాయి పరిశోధనలు పూర్తి చేసి మార్కెట్‌లో విడుదల చేస్తామని చెప్తున్నారు.

రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీటీ పత్తి సూటి రకాల రూపకల్పన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మూడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాగుకు అనుకూలంగా ఉండే బీటీ పత్తి సూటి రకాలను విడుదల చేసే అవకాశముంది.  

- తిరుమల్‌రావు, సీనియర్‌ శాస్త్రవేత్త,ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధన స్థానం


logo