గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 10:36:50

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతనిధులు  జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. పోలీసుల పరేడ్‌, శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని చారిత్రాత్మక బురుజుపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సిద్దిపేట బురుజు కొత్త శోభ సంతరించుకుంది. 

 జిల్లా కేంద్రాల్లో.. 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వేడుకలు అంబరాన్నంటాయి. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  


ఆదిలాబాద్‌ జిల్లాలో.. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు. 


మహబూబాబాద్‌ జిల్లాలో..

మహబూబాబాద్  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ గౌతమ్ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కరోనా నియంత్రణలో వైద్యశాఖ, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలసేవలు వెలకట్టలేనివని అభినందించారు. జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అందరి సహాయ సహకారాలతో భవిష్యత్‌లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో.. 

 జిల్లా కేంద్రంలోని  పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ పౌసమి బసు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


VIDEOS

logo