బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 02:55:05

గరీబోళ్ల కోసమే.. కానూన్లు

గరీబోళ్ల కోసమే.. కానూన్లు

  • ప్రజలే కేంద్ర బిందువులుగా చట్టాలు అమలుకావాలి
  • ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలు పనిచేయాలి
  • వార్డులవారీగా తిరుగుతూ ఆస్తులను ఆన్‌లైన్‌ చేయించాలి
  • ‘ధరణి’ రూపుదిద్దుకొనేలోపే భూ సమస్యలను పరిష్కరించాలి
  • భూముల క్రమబద్ధీకరణతో ఖజానా నింపాలనుకోవడంలేదు
  • ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • కొత్త చట్టాల ఫలితాలు చివరి గుడిసెదాకా అందాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎంతో ముందుచూపుతో రాష్ట్ర అభివృద్ధికోసం దార్శనికతతో రూపొందిస్తున్న చట్టాల వల్ల ఏ ఒక్క నిరుపేదకూ ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఆ చట్టాల వల్ల కలిగే ఫలితాలు చివరి గుడిసెదాకా అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, వారి సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న చట్టాల అమలుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.

పది కాలాలపాటు మేలు చేసేలా..

విప్లవాత్మక పాలనాసంస్కరణల్లో భాగంగా స్వరాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టాలు ప్రజలకు పదికాలాలపాటు మేలు చేయనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. వీటి అమలుక్రమంలో పేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని తెలిపారు. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటంలేదని స్పష్టంచేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేలోపే భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి.. విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాలు, నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి విధివిధానాలు

ఆయా పట్టణాలు, నియోజకవర్గాల్లో నివాసస్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి.. ప్రతి సమస్యనూ అధికారులతో నోట్‌ చేయించారు. వాటిని తక్షణమే పరిష్కరించడానికి విధివిధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇంతవరకూ చూడలేదని సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా దార్శనికతతో సీఎం కేసీఆర్‌ తీసుకొంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని హర్షం వ్యక్తంచేశారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ఒవైసీ, బలాల, కౌసర్‌ మొహినొద్దీన్‌, పాషాఖాద్రీ, దాస్యం వినయ్‌భాస్కర్‌, సుధీర్‌రెడ్డి, దానం నాగేందర్‌, సాయన్న, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, వివేకానంద, కాలేరు వెంకటేశ్‌, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్‌, ప్రకాశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌, బాల్క సుమన్‌, నన్నపునేని నరేందర్‌, గణేశ్‌ బిగాల, బొల్లం మల్లయ్యయాదవ్‌, కోరుకంటి చందర్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, మేయర్లు బొంతు రామ్మోహన్‌, జక్కా వెంకట్‌రెడ్డి, నీలం గోపాల్‌రెడ్డి, గుండా ప్రకాశ్‌రావు, సునీల్‌రావు, దుర్గ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎంవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్వరాష్ట్రంలో భూములకు భారీ డిమాండ్‌

‘తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన కారణంగా భూ తగాదాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గిపోయింది. కండ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్‌ నగరానికిఉండే గంగాజమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని వారి సంస్కృతి, సంప్రదాయాలను స్వేచ్ఛగా చాటుకొంటున్నారు. ముస్లింలు పాతబస్తీ దాటి న్యూసిటీలో ఆవాసాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. పేదరికానికి కులం, మతం లేదు. అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

పక్కా ఇండ్లు, బంగళాలుగా మారిన గుడిసెలు

‘మురికివాడల్లోని ఒకనాటి గుడిసెలు నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. వారి హృదయాలను మన చేతుల్లో పెట్టారు. చారిత్రక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించాల్సిన బాధ్యత ఉన్నది. నోటరీ, జీవో 58, 59ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులవారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చూడాలి. భూములు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్‌డేట్‌ చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.


logo