శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:59:56

తెలంగాణ బ్రాండ్‌

తెలంగాణ బ్రాండ్‌

 • సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన
 • అంతర్జాతీయ విపణికి మన బియ్యం
 • సేద్యాన్ని లాభంగా మార్చడమే లక్ష్యం
 • డిమాండ్‌ ఉన్న పంటలు పండించాలి
 • త్వరలోనే రైతులు, రైతుబంధు సమితులు, అధికారులతో సమావేశం
 • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌
 • వ్యవసాయంపై ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్‌ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 

‘రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందాలి. దానికి అనుగుణంగానే ప్రతీదీ జరుగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండ్‌కు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారుచేయాలి. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. దాని ప్రకారమే సాగు జరుగాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఇన్వెంటరీ తయారుచేయాలి

‘వ్యవసాయశాఖ ఇన్వెంటరీ తయారుకావాలి. వ్యవసాయశాఖకున్న ఆస్తులు, భవనాలు ఇతరత్రా వివరాలు సమగ్రంగా నమోదుచేయాలి. రికార్డు చేయాలి. గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కతీయాలి. ఇంకా రైతులకు ఏమి కావాలో గుర్తించాలి. దానికి అనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళిక తయారుచేయాలి. రైతుల నుంచి వివరాలు సేకరించాలి. కచ్చితమైన వివరాలతో ఫార్మాట్‌ ద్వారా సమాచారం సేకరించాలి. త్వరలోనే నేను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చిస్తాను’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు జనార్దన్‌ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకొంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి జిల్లాలవారీగా పరిస్థితిని సమీక్షించారు. లాక్‌డౌన్‌ అమలు, వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న సడలింపుల వల్ల తలెత్తిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. 


నూతన పోకడలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేకబ్రాండ్‌ను సృష్టించేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రజల ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా మెరుగైన వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని కోరింది. వ్యవసాయ విధానంపై సూచనలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కూడిన ఈ ఉపసంఘం పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఇటీవల సమావేశమైంది. 

రాష్ట్రంలో భూమి స్వభావం, సాగునీటి వసతి, పంటల తీరు, మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ సౌకర్యాలు, ప్రజల ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై లోతుగా చర్చించింది. వ్యవసాయరంగంలో నూతన పోకడలను ప్రోత్సహించాలని సూచించింది. వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు, ఖర్జూరం నూనెగింజల పంటసాగు పెంచాలని, తాండూరు కందులకు, కొల్లాపూర్‌, జగిత్యాల మామిడికి, బాలానగర్‌లో కస్టర్డ్‌ యాపిల్‌ కోసం జీఐ రిజిస్ట్రేషన్‌ అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది.

ఎల్‌ఎండీకి 5 టీఎంసీల నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

కరీంనగర్‌లో రోజూ మంచినీటి సరఫరా కోసం ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీల నీటివిడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 7 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నదని, కరీంనగర్‌లో మిషన్‌ భగీరథ పథకం, రోజూ నీటి సరఫరాకు ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌కు విన్నవించగా, సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే   నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. శనివారం నుంచి ఐదు రోజులపాటు రోజు ఒక్క టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఎస్సారార్‌ నుంచి ఒక గేటు ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎండీకి విడుదల కొనసాగుతున్నది. 

మంత్రివర్గ ఉపసంఘం సూచనలు

 • మరో 55 వేల ఎకరాల్లో కూరగాయలసాగు
 • పప్పుధాన్యాల పంటసాగు విస్తీర్ణం పెంపు 
 • ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం
 • అన్నిరకాల పంటల్లో విత్తనోత్పత్తి
 • ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బియ్యానికి బ్రాండ్‌ఇమేజ్‌ కల్పన
 • మెరుగైన కొత్త వంగడాల అభివృద్ధి
 • మన అవసరాలు తీరాకే విత్తనాల ఎగుమతి
 • పాస్ఫేట్‌ ద్రావణీకరణ బాక్టీరియా (పీఎస్బీ) వాడకంపై అవగాహన 
 • పాస్ఫరస్‌ ఎరువుల వాడకం తగ్గింపు 
 • సేంద్రియ కార్బన్‌ను పెంచడానికి పెసర, సన్‌హెంప్‌, జీలుగ వంటి పచ్చ ఎరువు పంటలసాగుకు ప్రోత్సాహం 
 • ఎక్కువ డిమాండ్‌ ఉన్న కూరగాయలు, పువ్వుల విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి.


logo