మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:10

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ

  • సిద్దిపేట స్ఫూర్తిగా అభివృద్ధి ప్రణాళికలు 
  • 42 అంశాలు ప్రాతిపదికగా నమూనా 
  • ప్రతి మున్సిపాలిటీలో షీ టాయిలెట్స్‌
  • ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శమని.. దానిని నమూనాగా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసుకోవాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఉమ్మడి మెదక్‌జిల్లాలోని మున్సిపాలిటీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని, త్వరలో నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మున్సిపాలిటీల అభివృద్ధికి నమూనాపట్టిక తయారుచేశామని చెప్పారు. ఆ అంశాల్లో మీ మున్సిపాలిటీలో ఏమి ఉన్నాయి? ఏమిలేవు? అన్నవి చెక్‌ చేసుకోవాలని సూచించారు. మూడున్నరేండ్లలో అభివృద్ధి పట్టికలో ఏస్థానంలోకి తీసుకెళ్లాలి? ఏ పనులు ప్రాధాన్యక్రమంలో చేపట్టాలి? అనే ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానంలో భాగంగా మన టౌన్‌ అభివృద్ధిని మనమే ప్లాన్‌ చేసుకోవాలన్నారు.  ఆగస్టు 15లోగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వేయిమందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ ఉండే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ఇందులో మహిళల కోసం యాభైశాతం షీ టాయిలెట్లు ఉండాలని ఆదేశించారు. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం అన్ని పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామన్నారు. తెల్లకార్డు ఉన్నవారికి ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని.. ఇతరులకు రూ.100కు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రమంతా ఇదేవిధానం అనుసరించాలని సూచించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, మూడున్నరేండ్లు ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలని కోరారు. మున్సిపాలిటీల్లో ఆదాయవనరులను పెంచుకోవడంపై దృష్టి సారించాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఠంచన్‌గా నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. శానిటరీ సిబ్బంది వివరాలను వార్డుల్లో ప్రదర్శించాలని, వారికి ప్రతినెలా మొదటివారంలోనే రూ.12వేల వేతనం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమోలిష్‌ వేస్టేజ్‌తో టైల్స్‌ తయారు చేయవచ్చని, ఇలాంటి ప్రాజెక్టును ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. 

తడి, పొడి చెత్తపై చైతన్యం తేవాలి:  మంత్రి హరీశ్‌రావు 

ప్రతి మున్సిపాలిటీలో నూటికి నూరుశాతం తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో డంప్‌యార్డు ఉండాలని.. దానిని ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రిసోర్స్‌, పవర్‌, శానిటైజ్‌, వాటర్‌ఆడిట్‌ నిర్వహించి గుణాత్మకమార్పునకు నాంది పలుకుదామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. డెబ్రిస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు, యానిమల్‌ కేర్‌సెంటర్లు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుచేస్తామన్నారు. నీటిపన్ను వందశాతం వసూలయ్యేలా చర్యలు చేపడుతామని తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట తదితర మున్సిపాటీల్లో నల్లాల ద్వారా నీరిచ్చే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, హనుమంతరావు, ధర్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

అధికారులకూ స్ఫూర్తినిచ్చే పుస్తకం.. ఎస్కే జోషి పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తమకు మాత్రమే కాకుండా, అధికారులకు స్ఫూర్తినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి రాసిన పుస్తకం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎస్కే జోషి సీఎస్‌గా తన అనుభవాలను రంగరించి చేసిన రచన.. ‘కో టీ కాలింగ్‌ - టువర్డ్స్‌ పీపుల్స్‌ సెంట్రిక్‌ గవర్నెన్స్‌' అని కొనియాడారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఈ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తన అనుభవాలను ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చారని, తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. సీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన ఎస్కే జోషి, ఈ పుస్తకం ద్వారా భవిష్యత్‌ తరాలకు పరిపాలనను పుస్తక రూపంలో అందించారని పేర్కొన్నారు. ఎస్కే జోషి మాట్లాడుతూ ప్రభుత్వంలో పనిచేసిన సమయం చాలా అద్భుమైనదని, ఇక్కడి పాలన ప్రజల కేంద్రంగా.. అవసరాలకు అనుగుణంగా కొనసాగుతున్నదని చెప్పారు.  logo