ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:24:48

సవాళ్లు వీరికి గులాములు..

 సవాళ్లు వీరికి గులాములు..

  • శ్రీశైలం ప్లాంట్‌ పునరుద్ధరణలో జెన్‌కో ఇంజినీర్ల ప్రతిభ
  • జపాన్‌ సాయం లేకుండానే మరమ్మతులు
  • ఇంజినీర్ల కృషితో 20 కోట్లు ఆదా  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషిలోని అసలైన శక్తిసామర్థ్యాలు బయటపడుతాయి.. అప్పుడు సవాళ్లు కూ డా గులాములు అవుతాయని అనడానికి శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ పనులే నిదర్శనం. అత్యంత విషాదాన్ని మిగిల్చిన శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టులో అగ్ని ప్రమాద ఘటన.. మన తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లలో ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశాన్ని కల్పించింది. విద్యుత్‌ ప్రాజెక్టులోని యం త్రాలన్నీ జపాన్‌కు చెందిన హిటాచి కంపెనీవి. వాటికి చిన్న మరమ్మతు అయినా సరే, వాళ్లు వచ్చి చేయాల్సిందే. ఈసారి వారిపై ఆధారపడకుండా.. ప్రా జెక్టులో జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్‌ యూనిట్లను పునరుద్ధరించడాన్ని జెన్‌కో సవాల్‌గా తీసుకున్నది. రేయింబవళ్లు కష్టపడి 1, 2వ యూనిట్లను ఇంజినీర్లు పునరుద్ధరించారు. ఈ యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. అసాధ్యం అనుకున్న పనులను ఇంజినీర్లు సుసాధ్యం చేశారు. సుమారు రూ.20 కోట్ల వరకు ఆదా చేశారు.  

16 లక్షల చదరపు అడుగుల మేర పొగ చారికలు..

దుర్ఘటనలో శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం మొత్తం పొగతో నిండిపోయిన విషయం తెలిసిందే. యూనిట్ల పునరుద్ధరణలో భాగంగా.. విద్యుత్‌ కేంద్రం మొత్తం యంత్రాలు, పరికరాలు, గోడలు, పైకప్పుకు అంటుకున్న పొగ చారికలను తొలగించడంకూడా కష్టసాధ్యమైందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం చాలా మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. బకెట్లలో సర్ఫ్‌ నీళ్లు, స్పాంజిలు తీసుకుని ఎక్కడికక్కడ శుభ్రంగా తుడవడం మొదలు పెట్టారు. ఇంజినీర్ల అంచనా ప్రకారం విద్యుత్‌ కేంద్రం మొత్తంలో సుమారు 16 లక్షల చదరపు అడుగుల మేర ఇలాంటి పొగ చారికలు ఉన్నాయని అంచనా వేసి.. వాటన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. రెండు నెలలు గడిచినా ఇప్పటికీ ప్రాధాన్యక్రమంలో యూనిట్లవారీగా ఈ పొగ చారికలను తుడుస్తున్నారంటే అక్కడి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.

అపారమైన అనుభవం

నిజానికి శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో అత్యంత తక్కువ నష్టం జరిగింది ఒకటి, రెండో యూనిట్లకు మాత్రమే. అందుకే వాటిని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లు సంకల్పించారు. జపాన్‌ ఇంజినీర్ల సాయం లేకుండానే విజయవంతంగా పూర్తిచేయడంతో ప్రతిభను చాటడంతోపాటు అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్‌ హిటాచి ఇంజినీర్లకు దీటుగా వారుకూడా జల విద్యుత్‌ యూనిట్లలోని టర్బయిన్లు, మోటర్లు, పంపులు, ఇతర సాంకేతిక అంశాలపై పట్టు సాధించారు. ఒకటి, రెండో యూనిట్ల పునరుద్ధరణ పూర్తికావడంతో.. ఇప్పుడు ఒకింత నష్టం జరిగిన ఇతర యూనిట్లు, అలాగే తీవ్రంగా నష్టం వాటిల్లిన నాలుగో యూనిట్‌నుకూడా తామే స్వయంగా పునరుద్ధరించుకోగలమనే నమ్మకాన్ని జెన్‌కో ఇంజినీర్లు వ్యక్తంచేస్తున్నారు. వాటిని పునరుద్ధరించే పనులను వేగంగా చేపట్టి ముందుకు సాగుతున్నారు. మరో నాలుగు నెలల కాలంలో.. కేవలం రూ. 50 నుంచి రూ. 65 కోట్ల ఖర్చుతోనే మిగిలిన యూనిట్లన్నింటినీకూడా బాగు చేసుకోగలమనే నమ్మకం వారిలో కనపడుతున్నది. మొత్తానికి దురదృష్టకరమైన సంఘటన నుంచి పాఠాలు నేర్చుకొంటూ.. తమలోని ప్రతిభను, మేధస్సును మెరుగుపర్చుకొంటున్న తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లు ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నారు.

టీ, టిఫిన్‌, భోజనం అక్కడే..

ఆగస్టు 20 నాడు అర్ధరాత్రి జరిగిన దుర్ఘటన  తర్వాత పునరుద్ధరణ పనులు మెల్లగా మొదలయ్యాయి. ప్రణాళిక ప్రకా రం చేపడితే పనుల్లో విజయం సాధించవచ్చని రూఢీ చేసుకున్న తర్వాత రూట్‌మ్యాప్‌ తయారుచేసుకున్నారు. వెంటనే కార్యరంగంలోకి దిగిన జెన్‌కో ఇంజినీర్లు సుమారు 60 రోజులపాటు రేయింబవళ్లు కష్టపడి ఒకటి, రెండో యూనిట్లను విజయవంతంగా పునరుద్ధరించారు. అయితే, ఇది అంత సులభంగా మాత్రం సాధ్యం కాలేదు. దీని వెనుక 100 మంది ఇంజినీర్లు, కార్మికులు, అధికారుల కృషి ఎంతగానో ఉన్నది. మొదట్లో భయంభయంగానే పనులు మొదలయ్యాయి. రోజుకు ఏడెనిమిది గంటలపాటు మాత్రమే పనులు సాగేవి. సరిగా ఆక్సిజన్‌ కూడా అందేది కాదు. ఆహారం తీసుకోవడానికికూడా బయటకు రావాల్సి వచ్చేది. దీనివల్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేయలేమని గ్రహించిన ఉన్నతాధికారులు అప్పటికప్పుడు.. బయటి నుంచి గాలిని పంపింగ్‌చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అంటే.. రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ఇంజినీర్లు శ్రమించారు. టీ, టిఫిన్‌, భోజనాలుకూడా పని స్థలాలవద్దకే తెప్పించుకున్నారు. దీనితో సమయం ఆదా అయ్యింది. అందుకే అనుకున్న సమయంలోగా పునరుద్ధరించగలిగారు. దీనితో సుమారు రూ.20 కోట్ల వరకు ఆదా అయినట్టుగా ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాలతోనే ఇది సాధించడంతో తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది.