హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతికసమస్య పూర్తిగా తొలగిపోయింది. సోమవారం నుంచి వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో వేగం పెరిగింది. ఒక్కరోజే 3,600 రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టేట్ డాటా సెంటర్లో క్యూఆర్ కోడ్‌లో ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు సరిచేశారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ స్టేట్ డాటాసెంటర్ అధికారులు రెండురోజులుగా శ్రమించి ప్రధాన సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించారు. ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి సాంకేతిక సమస్యను అధిగమించారు. సెంట్రల్ సర్వర్‌లో ఉన్న డాటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు తీసుకునే క్రమంలో క్యూఆర్ కోడ్‌లో సమస్య తలెత్తిందని చెప్తున్నారు. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి రాష్ట్రంలో నాలుగురోజులుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి.