సోమవారం 25 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 19:49:34

మత రాజకీయాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ కవిత

మత రాజకీయాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : మత రాజకీయాలను హైదరాబాదీలు తిప్పికొట్టాని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం చివరిరోజు బోరబండలో టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్డు షోలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని ఓట్లు.. సీట్ల కోసం బీజేపీ నాయకులు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నిరంతరం ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్న టీఆర్ఎస్‌కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ప్రభుత్వం పేదలకు నెలకు రూ.1500, ఉచిత బియ్యం అందించిందని గుర్తుచేశారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.పది వేలు తక్షణ సాయాన్ని అందించామని, సాయం అందని వారికి డిసెంబర్ 7 నుంచి అందిస్తామని చెప్పారు. కష్టకాలంలో రాష్ట్రానికి నయాపైసా సాయం చేయని బీజేపీ హైదరాబాద్‌లో ఓట్లకోసం మత రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న బీజేపీ హామీపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, బీజేపీ అధికారంలో ఉన్న బెంగుళూరులో ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. దశాబ్దాల నుండి బోరబండలో ప్రజలకు ఇబ్బందిగా మారిన భూ రిజిస్ట్రేషన్ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కారించామన్నారు. ఆరేండ్లలో డివిజన్ అభివృద్ధికి బాబా ఫసియుద్దీన్ ఎంతో కృషి చేశారన్నారు. డిసెంబర్ 1న‌ జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఓటేసేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ‌కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్, నాయకులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo