ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:20:59

కొండదిగి చెరువు దారి

కొండదిగి  చెరువు దారి

  • కొండపోచమ్మ నుంచి జలాలు విడుదల
  • జగదేవ్‌పూర్‌ కాలువలో గోదారి పరవళ్లు
  • మాగాణిగా మారనున్న బీడు భూములు  
  • విప్‌ గొంగిడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

బేసిన్‌లోనే అత్యంత ఎత్తునుంచి గోదావరి జలాలు కిందకుపారాయి. బుధవారం కొండపోచమ్మ జలాశయం నుంచి ఎడమకాలువ ద్వారా జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల్లోకి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గేటు ఎత్తి నీటిని వదిలారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌పై పండుగ వాతావరణం నెలకొన్నది.


గజ్వేల్‌: కొండపోచమ్మ జలాశయం నుంచి ఎడమకాలువ ద్వారా జలాలు జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల్లోకి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గేటు ఎత్తి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మర్కూక్‌, శివారు వెంకటాపూర్‌ గ్రామాల మహిళలు బోనాలు బతుకమ్మలతో తరలివచ్చారు. ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత కూడా బతుకమ్మతో కట్ట కింది వరకు వెళ్లి కాలువ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

జలాశయం నుంచి నీరు విడుదల కాగానే పెద్దఎత్తున పటాకులు కాల్చి స్థానికులు, రైతులు మిఠాయిలు పంచుకున్నారు. భారీఎత్తున వాహనాలు రావడంతో కట్టపొడవునా రాకపోకలు స్తంభించాయి. గత నెల 29న సీఎం కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్లను ప్రారంభించి కొండపోచమ్మ జలాశయంలోకి జలాల ఎత్తిపోతను ప్రారంభించగా.. బుధవారం నాటికి నీటినిల్వ 5 టీఎంసీలకు చేరింది. రిజర్వాయర్‌ నుంచి చెరువులను నింపేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీచేయడంతో ముందుగా జగదేవ్‌పూర్‌ కాలువలోకి నీటిని వదిలారు. అనంతరం శివారు వెంకటాపూర్‌ వద్ద తుర్కపల్లి కాలువ వద్ద పూజలు నిర్వహించి గేట్లుఎత్తి నీటిని వదిలారు.


బీడు భూముల్లో బంగారు పంటలు

కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడుభూములు మాగాణిగా మారి బంగారు పంటలు పండుతున్నాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరందడంతో బోరుబావుల కష్టాలు తప్పనున్నాయని పేర్కొన్నారు. రైతన్న అప్పు తీసుకునే స్థాయినుంచి ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని ఆకాంక్షించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ అత్యంత ఎత్తులో సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేసిన అద్భుత ప్రాజెక్టు అని అభివర్ణించారు. జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల ద్వారా 42 చెరువుల్లోకి గోదావరి జలాలు చేరుతాయని చెప్పారు. 

కొద్దిరోజుల్లోనే కొండపోచమ్మసాగర్‌ ద్వారా 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నదన్నారు. కొండపోచమ్మ తల్లి కరుణ, సీఎం కేసీఆర్‌ సంకల్పంతో బీడుభూముల్లో బంగారు పంటలు పండి హరితతెలంగాణగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, నాయకులు యాదవరెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.logo