మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Aug 08, 2020 , 01:46:05

జల సంబురం

జల సంబురం

  • సాగర్‌ కింద వానకాలం పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు
  • నాగార్జునసాగర్‌ సీఈకి సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • స్విచ్చాన్‌ చేసి నీటిని వదిలిన ఎమ్మెల్యే నోముల
  • ఎడమకాలువ ద్వారా సాగునీటి విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ /నందికొండ:  నాగార్జునసాగర్‌ ఎడమకాలువ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వానకాలం సాగుకు వెంటనే నీటివిడుదలను ప్రారంభించాలని శుక్రవారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్‌కు స్పష్టంచేశారు.కృష్ణా ఎగువన వరద ప్రవాహాలు బాగానే ఉన్నాయని, ఈసారి వర్షాలు కూడా సమృద్ధిగా పడే అవకాశముందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోఉన్న సాగర్‌ ఆయకట్టు రైతులకు ఈ వానకాలం పంటలకోసం పూర్తిస్థాయిలో నీళ్లివ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నో ముల నర్సింహయ్య, ప్రాజెక్టు సీఈ నర్సింహ స్విచ్చాన్‌చేసి ఎడమ కాలువకు నీటిని వదిలారు. ముందుగా వెయ్యి క్యూసెక్కులను విడుదల చేయగా.. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్టు సీఈ తెలిపారు. ఆన్‌ ఆఫ్‌ పద్ధతితో నీటి సరఫరాను కొనసాగిస్తామని, తొలి విడుతగా వరుసగా 25 రోజులపాటు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ముందస్తుగానే జలకళ

తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త చర్యలతో నాగార్జునసాగర్‌ ముందస్తుగానే జలకళను సంతరించుకుంది. గతంలో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండి, స్పిల్‌వే ద్వారా నీటిని విడుదలచేస్తేనే సాగర్‌కు వరద వచ్చేది. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు ద్వారా భారీఎత్తున జలాలను తరలించడంతో శ్రీశైలం నిండటం మరింత ఆలస్యమయ్యేది. కానీ, ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్న క్రమంలోనే ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ప్రారంభించడంతో సాగర్‌కు నీటి విడుదల కొనసాగింది. క్రమం తప్పకుండా 40వేల క్యూసెక్కులు రావడంతో కొద్దిరోజుల్లోనే 550 అడుగులకు చేరింది. నీటి విడుదలపై ముందుగానే ఇండెంట్‌ సమర్పించడంతో బోర్డు అనుమతులిచ్చింది. 

సీఎం ఆదేశాలపై పువ్వాడ ధన్యవాదాలు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరిన వెంటనే విడుదలకు ఆదేశాలివ్వడంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఆరున్నర లక్షల ఎకరాలకు నీటిని వదలాలని విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌ను కోరినట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి ప్రణాళికపై ఈ నెల 9న సమావేశం నిర్వహిస్తున్నట్టు మంత్రి పువ్వాడ ప్రకటించారు.

తాజావార్తలు


logo