శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:59:56

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ

  • యూఐఎల్‌ఆర్‌-2020 నిబంధనలు విడుదల 
  • సుస్థిర ప్రణాళికా అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అక్రమ, అనధికార లేఅవుట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో వాటిని క్రమబద్ధీకరించుకొనేందుకు రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించింది. హెచ్‌ఎండీఏ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇచ్చింది. మంగళవారం ప్రభు త్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అనధికార, అక్రమ లేఅవుట్‌ క్రమబద్ధీకరణ నిబంధనలు (రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ అన్‌ అప్రూవ్డ్‌, ఇల్లీగల్‌ లేఅవుట్‌ రూ ల్స్‌)-2020ను జారీచేశారు. ఆగస్టు 31 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు. 

క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 4 నుంచి అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు రూ. వెయ్యి, దరఖాస్తు కోసం రూ.10 వేలు ఫీజు నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కామన్‌ వెబ్‌పోర్టల్‌, మీసేవా కేంద్రాలు, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లతోపాటు క్రమబద్ధీకరణ ప్రక్రియకోసం రూపొందించిన యాప్‌ను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 26 వరకు రిజిస్ర్టేషన్‌ అయిన స్థలాలకు ఈ అవకాశం ఉంటుందని, దరఖాస్తుదారులు సేల్‌డీడ్‌, టైటిల్‌ డీడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, జీపీఏ పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఆగస్టు 26న ఉన్న భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలను నిర్ణయించారు. అనధికార లేవుట్లలో పదిశాతం ఖాళీస్థలం లేకపోతే ప్లాట్‌ విలువలో 14% అదనపు చార్జీ చెల్లించాలి. పేదలు నివాసం ఉండే మురికివాడల్లో బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ చార్జీలను చదరపు మీటరు స్థలానికి ఐదు రూపాయలుగా నిర్ణయించారు. 

  • పట్టణాలు, నగరాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లు, మున్సిపాలిటీల కమిషనర్లు.. గ్రామాల్లో అయితే కలెక్టర్‌ లేదా అడిషనల్‌ కలెక్టర్‌ ఈ ప్రక్రియకు ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తారు.
  • వ్యక్తులు, ప్రైవేటు డెవలపర్లు, సంస్థలు, కంపెనీలు, ప్రాపర్టీ డెవలపర్లు, సొసైటీల ఆధ్వర్యంలోని అనధికార లేఅవుట్లకు, లేఅవుట్లలోని ప్లాట్లకు, వెంచర్లకు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.
  • అనధికార లేవుట్లకు సంబంధించి ఆగస్టు 26 వర కు మొత్తం ప్లాట్లలో 10% ప్లాట్ల అమ్మకం పూర్తయితేనే మిగిలిన వాటికి క్రమబద్ధీకరణఉంటుంది. లేఅవుట్లలోని కొన్నిప్లాట్ల వారు మాత్రమే క్రమబద్ధీకరణకు ముందుకువచ్చినప్పుడు మొత్తం లేఅవుట్‌ క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తే స్థానిక అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • రక్షణశాఖ, ఎయిపోర్టు స్థలాలు.. చమురు, గ్యాస్‌ పైపులైన్ల ప్రాంతాలోని నిబంధనల మేరకు జరుగుతుంది. 111 జీవో ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలు వర్తిస్తాయి. న్యాయ వివాదాలు ఉన్నవి, సీలింగ్‌ మిగులు, ప్రభుత్వ, దేవాదాయశాఖ, వక్ఫ్‌, శిఖం, రిజిస్ర్టేషన్‌కు అనుమతిలేని భూ ముల క్రమబద్ధీకరణకు అనుమతి ఉండదు.

చెరువుకు 30 మీటర్ల దూరం ఉంటేనే..

పదిహెక్టార్ల కంటే ఎక్కువ పరిధి ఉండే నదీ పరివాహకం, చెరువుకు 30 మీటర్ల దూరం అవతల ఉన్న లేఅవుట్లు, ప్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. పది హెక్టార్లలోపు చెరువులు, కుంటలు, శిఖం భూములతోపాటు, కాలువలు, వాగులకు తొమ్మిది మీటర్లు, నాలా అయితే రెండు మీటర్ల దూరం దాటినతర్వాతే ఉండాలి. మాస్టర్‌ ప్లాన్‌, జోనల్‌ మాస్టర్‌ప్లాన్‌, రెవెన్యూ రికార్డులు, సాగునీటిశాఖ రికార్డుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ ఉంటుంది.logo