బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 18:55:35

ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ : మంత్రి కేటీఆర్‌

ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి డిజటలైజేషన్‌ చేస్తామని, ప్రజలపై భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో భూముల వివాదాలు క్రమంగా సమసిపోతాయన్నారు. పట్టణ, గ్రామీణ ఆస్తులను అన్‌లాక్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తులను అన్‌లాక్‌ చేస్తే వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతదన్నారు. నిజాం హయాంలో 55 లక్షల ఎకరాల భూమి వారి వద్దే ఉండేదని ఆ భూమి క్రమంగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందన్నారు. 

అసలు యజమానికి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను సమకూరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. మతపరమైన ఘర్షణలు లేవన్నారు. సరైన అభివృద్ధి అజెండా లేకుండా ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయన్నారు. వేర్పాటువాద అజెండాతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు చేపట్టే అభివృద్ధి పనుల గురించి చెప్పట్లేదన్నారు. విభజన రాజకీయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. హైదరాబాద్‌లో మళ్లీ అరాచకం రావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.67 వేల కోట్లతో టీఆర్‌ఎస్‌ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. 

కేవలం డబ్బులు ఖర్చు చేయడమే అభివృద్ధి కాదని ప్రగతికి కావాల్సిన ప్రణాళిలను రూపొందించడం వాటని సమర్థంగా అమలు చేయడమే అసలైన అభివృద్ధి అన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు. అప్పుడే ప్రైవేటు రంగం ఒడిదుడుకులకు గురికాదన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలతో రాష్ర్టానికి పెట్టుబడులు రావన్నారు. నేమ్‌ ఛేంజర్లు, గేమ్‌ ఛేంజర్లు మనకు అక్కర్లేదన్నారు. 


logo