గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:32:15

పిలిచి మరీ.. 11 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

పిలిచి మరీ.. 11 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

శాయంపేట: వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట తాసిల్దార్‌ ఆఫీస్‌లో 11నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జాయింట్‌ రిజిస్ట్రార్‌ హరికృష్ణ ఆఫీస్‌కు వచ్చారు. ధరణి ఆపరేటర్‌ స్లాట్‌ బుక్‌ చేసినవారి వివరాలు చూసినా ఎవరూ రాలేదు. 11 గంటలకు స్లాట్‌బుక్‌ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. స్లాట్‌ బుక్‌ చేసుకొన్న భూమి కొనుగోలుదారు మాచర్ల శివకుమార్‌, అమ్మకందారు సమ్మయ్య, ఇద్దరు సాక్షులతో కలిసి వచ్చారు. వెంటనే ఆపరేటర్‌ వారినుంచి డాక్యుమెంట్లు తీసుకొని, ముందు ఇద్దరు సాక్షుల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేశారు. అనంతరం అమ్మకందారు, కొనుగోలుదారు, సాక్షుల బయోమెట్రిక్‌ తీసుకొని ఫొటో క్యాప్చర్‌ చేశారు. వాటిని జాయింట్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌కు పంపించారు. రిజిస్ట్రార్‌ ఫైల్‌ను పరిశీలించి ఓకే చేశారు. తర్వాత రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌ కోసం ధరణి ఆపరేటర్‌ లైన్‌కు పంపారు. ఆయన డాక్యుమెంట్‌ వెనుక రివర్స్‌ ఎండార్స్‌ చేశారు. అమ్మకం, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షుల సంతకాలు తీసుకొన్నారు. ఆ వెంటనే డాక్యుమెంట్‌పై జాయింట్‌ రిజిస్ట్రార్‌ హరికృష్ణ సంతకం చేశారు. దాన్ని స్కాన్‌ చేసి సైట్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. మళ్లీ రిజిస్ట్రార్‌ లైన్‌కు వెళ్లగా డాక్యుమెంట్‌పై డిజిటల్‌ సైన్‌ చేశారు. అలా కేవలం 11 నిమిషాల్లోనే అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు భూమి మారింది.