ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:19

పావుగంటలో రిజిస్ట్రేషన్‌

పావుగంటలో రిజిస్ట్రేషన్‌

  • పారదర్శకంగా, సులభంగా ధరణి ప్రక్రియ 
  • క్రయ, విక్రయదారుల్లో సంతో
  • నెరవేరుతున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

‘ఇంకెన్నాండ్లు ఇట్ల వచ్చిపోవాలె. పైసల్‌గూడ ముట్టజెప్తిమి. అసలు మా పనైతదా? పొద్దుందాక ఈడనే ఉంటే నోట్లెకు నాలుగు ముద్దలెట్లవొయ్యేది. జర సూడుండ్రి సారూ. మీ కాళ్లు మొక్కుతా’ అంటూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ఆఫీస్‌ల సుట్టూ తిరుగుతూ రైతులు పడిన గోస ఇక కనిపించదు. ధరణి రైతన్నల కష్టాలు తీర్చింది. పావుగంటలోనే పనులు పూర్తిచేస్తూ అన్నదాతలకు సంబురం తెచ్చింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా ఏది తీసుకొచ్చినా మనకు అక్కరొచ్చేదే. సీఎం కేసీఆర్‌ సారు అన్నిరకాలుగా ఆలోచించి మనకు మంచి చేసేదే అమలుచేస్తడు’ అనే భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు లాభం చేకూర్చింది. ఇప్పుడు ధరణి కూడా విజయవంతమైంది. రైతుల్లో సంతోషాన్ని నింపింది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయి పావుగంటలోనే పట్టా చేతికి వస్తున్నది. అత్యంత సులభంగా, పారదర్శకంగా.. వేగంగా ఈ ప్రక్రియ సాగుతున్నది. రాష్ట్రంలో మంగళవారంనాటికి 650కుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారులు చెప్తున్నారు. 

సమయం కలిసొస్తున్నది 

ధరణి ప్రారంభంతో భూ యజమానులు, కొనుగోలుదారులకు సగటున రెండ్రోజులు కలిసివస్తున్నది. గతంలో ముందుగా ఒకరోజు వెళ్లి దస్తావేజు రాయించుకునేవారు. తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లేవారు. పత్రాలు వచ్చాక మరో రోజు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఒక్క రిజిస్ట్రేషన్‌కు రెండుమూడ్రోజుల సమయం వృథా అయ్యేది. ప్రస్తుతం వీలున్నప్పుడు మీసేవకు వెళ్లి లేదా సొంతంగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. నమూనాపత్రాల ఆధారంగా దస్తావేజును సొంతంగా రాసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్‌ రైటర్‌ను సంప్రదించవచ్చు. నిర్దేశిత సమయంలో తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే చాలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేసారి, ఒకేచోట.. 15-20 నిమిషాల్లో పూర్తవుతున్నది.

ఏడాది ఎదురుచూశా

గతంలో నేను భూమి కొన్నప్పుడు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాక పాస్‌బుక్‌ రావడానికి ఏడాది పట్టింది. ఇప్పుడు ఆ ఇబ్బందిలేదు. ధరణిలో స్లాట్‌బుక్‌ చేసుకుని మంగళవారం మొయినాబాద్‌ తాసిల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లా. అర గంటలోపే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయ్యాయి. రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. ఈ విధానం చాలా చాలా బాగుం ది. కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా భూవివాదాలు తలెత్తకుండా ఉంటాయి. 

- కమల్‌ కామరాజు, సినీ హీరో 

భద్రత పెరిగింది 

ధరణితో భూములకు భద్రత పెరిగిందని అధికారులు, భూ యజమానులు చెప్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయినా మ్యుటేషన్‌ జరుగకపోవడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండేది. కొందరు అధికారులకు లంచం ఇచ్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. భాగ పంపకాలప్పుడు చాలా సందర్భాల్లో పలుకుబడి, డబ్బు కీలకపాత్ర పోషించేవి. తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు వరకు వెళ్లిన కేసులు ఎన్నో. ఇక విదేశాల్లో ఉన్నవారైతే తమ భూములు భద్రంగా ఉన్నాయో లేదోనని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఆ బాధలన్నీ తీరాయి. ఎన్నారైల భూములకు త్వరలో పాస్‌పోర్ట్‌ను అనుసంధానం చేయనున్నారు. తమ భూములకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని ఎన్నారైలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎప్పుడు కావాలన్నా పోర్టల్‌లో వివరాలను చూసుకొనే అవకాశం ఉండటం మరో అనుకూలాంశమని అంటున్నారు. 

వ్యవసాయ భూ సమస్యలపై అధ్యయనం! 

వ్యవసాయ భూముల సమస్యలపై (పబ్లిక్‌ గ్రీవెన్స్‌) అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వివాదాల్లేని భూములకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇచ్చారు. క్లియర్‌గా లేని భూములను పార్ట్‌(బి)లో పెట్టారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇచ్చిన భూములకు సంబంధించి కూడా ఇంకా చిన్న చిన్న సమస్యలున్నట్టు అధికారులు గుర్తించారు. పేర్లలో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, కబ్జాలు, సర్వేనంబర్‌ విస్తీర్ణంలో తేడాలు, మిస్సింగ్‌ సర్వేనంబర్లు, వ్యవసాయ భూములను మ్యుటేషన్‌ చేసే సమయలో తాసిల్దార్లు ఏకంగా వాటిని ప్లాట్లుగా నమోదు చేయడం తదితర సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా సమస్యలను పరిశీలించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో అధికారుల బృందం.. ఒకటి రెండు గ్రామాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. నివేదిక ఆధారంగా రైతులకు సంబంధించిన ఆయా సమస్యలను ఎలా పరిష్కరించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.