గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:13

ధరణితో ధైర్యం

ధరణితో ధైర్యం

  • నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి
  • ఆ వెంటనే పత్రాలతో అన్నదాతల మురిపెం
  • రైతులకు దన్నుగా నిలుస్తున్న పోర్టల్‌

‘కలలగూడ అనుకోలె ఇసొంటి రోజులొస్తయని.. ఇంత సంతోషంగుంటమని. ఏ సారూ కాళ్లు మొక్కకుంట ఇంత జల్ది పనయితదని’ అంటూ తాసిల్దార్‌ కార్యాలయాల నుంచి బయటకొస్తూ రైతులు సంబురం చేసుకుంటున్నారు. చేతిలో పట్టా, పత్రాలు పట్టుకుని.. స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ధరణి రైతుల్లో ధైర్యం నింపిందని సంతోషపడుతున్నారు. ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నదని హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

పాస్‌బుక్‌ వచ్చిందని స్వీట్లు పంచారు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పావుగంటలోనే మ్యుటేషన్‌ పూర్తయి పాస్‌బుక్‌ వచ్చిందనే సంతోషంతో ఖమ్మం జిల్లాలోని ఓ కుటుంబం స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నది. ‘మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం జీడీబీ పల్లి. వారసత్వంగా రెండు ఎకరాల 20 గుంటలు భూమి అచ్చింది. నాకు ముగ్గురు కొడుకులు. పెనిమిటి మరణించి చాలా కాలమైంది. అప్పటి సంది వాళ్ల పేర్న భూమి ఇద్దామనుకుంటి. మా కాలంల భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే పైసలతో పని. అంత ఈజీగా అయితదా, ఎంత ఖర్సయితదోనని దిగులుపడ్డా. ధరణితోటి పైసా ఖర్చు లేకుండా పదే పది నిమిషాలల్ల మా పోరగాళ్ల పేర్న మారిపోయింది. నా పేరునుంచి మా కొడుకు పేర్న మార్చుడు మా ఊరు నుంచి ఆటో ఎక్కి వచ్చినంతచేపు పట్టలే. కొడుకులు అమ్మా పనయ్యిందే అంటే అసలు నమ్మబుద్దిగాలే. తాసిల్దార్‌ కాయితాలు చేతిలో పెడితే సంబురమైంది. మా ఊరుకెల్లి మా చుట్టపోళ్లకు చూపిస్తే ఇంత జల్దీగా వచ్చినవేంది నిజమేనా అన్నరు. సీఎం కేసీఆర్‌ వల్లనే గిదంతా అయిందని చెప్పిన’ అని జీడీబీపల్లికి చెందిన అవులూరి అన్నపూర్ణ సంబురపడ్డారు. ‘గతంల రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ శానా తిరిగినం. డబ్బులు గుంజుడేగానీ ఒక్కరుగూడ పని చేయకపాయే. ఎన్నిసార్లు తిప్పుకుండ్రో లెక్కలేకుండే. ఏందిరా అయ్యా ఈ కర్మ అనుకుంటి. మా భూమి మా పేర్న మార్చుడుకు ఏంది మీ పెత్తనమని తిరుగబడితే మా అన్న ఊకో పెట్టిండు. సర్కారోళ్లతో పంచాయితి ఏంది అని సముదాయించిండు. ఇంతతో వీఆర్‌వో పోయిండు. ధరణి అచ్చింది. మా బాధలు పోయినయ్‌' అని ఖమ్మం జిల్లా కల్లూరు మండలకేంద్రానికి చెందిన అవులూరి రామిరెడ్డి పేర్కొన్నారు.

అంజన్న ఆనందం

ఒకప్పుడు పొద్దుందాక ఎదురుచూస్తెనే రిజిస్ట్రేషన్‌ అయ్యేది. పొద్దుగాలొస్తే.. పొద్దు గూకె దాక ఆఫీస్‌ కాడనే ఉండుడయ్యేది. కానీ ఇప్పు డు పని జెప్పున అయిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన రైతు అమిరిశెట్టి అంజయ్య. ‘నా భార్య మధురమ్మ పేరున 1.05 ఎకరాల భూమి ఉన్నది. ఎనిమిది నెలల కింద ఆమె అనారోగ్యంతో చనిపోయింది. ఆ భూమిని కొడుకుల పేరు మీద చేపిద్దామనుకున్న. మల్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు పోవాలె. కరోనా భయంతో వాయిదా ఏసుకుంటూ అచ్చిన. సీఎం కేసీఆర్‌ సార్‌ మండలంలనే భూముల రిజిస్ట్రేషన్లు, విరాసత్‌లు చేపిస్తుండ్రని తెలిసింది. కొడుకులిద్దరికి భూమిని విరాసత్‌ చేద్దామని మీ సేవలో బుక్‌చేసుకున్న. నా ఇద్దరు కొడుకులు, బిడ్డ, ఇద్దరు గవాయిలను తీసుకొని ఆఫీసుకు వచ్చిన. సార్లు సంతకా లు, వేలి ముద్రలు, ఫొటోలు తీసుకుని జెర సేపు ఆగుండ్రి అని జెప్పిండ్రు. అద్దగంటయినంక పత్రాలిచ్చిండ్రు. పనై పోయిందని జెప్పిన్రు. శానా సంతోషం అనిపించింది. ఇదివరకు మల్యాలకు భూముల రిజిస్ట్రేషన్‌కు వోతె రోజంతా గడిచేది. మా అసోంటి రైతుల బాధలు తప్పిన యి. రైతులంతా సీఎం సార్‌కు రుణ పడి ఉంటం’ అని అంజయ్య సంబురపడ్డాడు.

రిజిస్ట్రేషనంటే చీకటయ్యేది

గతంలో భూములు కొన్నా, అమ్మినా రిజిస్ట్రేషన్‌ కోసం బాన్సువాడ తాలూకా కేంద్రంలోని సబ్‌రిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ముందుగా ఆటోవారితో మాట్లాడి ఉదయమే ఇంటి నుంచి వెళ్లేవాళ్లం. ఇంటికి తిరిగొచ్చేసరికి చీకటయ్యేది. ఇప్పుడు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాక నిమిషాల్లో భూమిని రిజిస్ట్రేషన్‌ అయితుంది. నేను కొన్న ఎకరం పది గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ 30 నిమిషాల్లో అయిపోయింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- బోడ కృష్ణవేణి, గోద్మేగాం, పిట్లం మండలం, కామారెడ్డి జిల్లా 

ఏండ్లుగా కానిది.. నిమిషాలల్ల చేతికొచ్చింది 

నేను పెద్దగా చదువుకోలె. పొద్దున లేచి ఎవుసం చేయడమే తెలుసు. 1994లో వెంకట్‌రావుపేట శివారులో భూమి కొన్న. గప్పట్లనే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. రిజిస్ట్రేషన్‌లో పొరపాట్లు జరిగినయి. నాకు ఇంతవరకు ఈ భూమి పాస్‌బుక్‌లో ఎక్కలె. చుట్టుపక్కల రైతులకు రైతుబంధు వస్తున్నది. నాకు పంట రుణంతోపాటు రైతుబంధు రాకపోయేసరికి చాలా బాధపడిన. అధికారుల సుట్టూ తిరిగినా పనికాలె. ధరణి రావడంతో మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న. శుక్రవారం తాసిల్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. అప్పుడే భూమి నా పేరుమీదికొచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.

- గంగొల్ల యాదగిరి, రైతు, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా 

తక్లీఫ్‌ లేని కానూన్‌ తెచ్చిండ్రు

నాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్‌ గ్రామంలోని లంబాడీ తండా. మా తండ్రి బీమ్లా నాయక్‌. మేం నల్గురు అన్నదమ్ములం. ఊళ్లె మా తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమి ఉన్నది. రెండేండ్ల కిందట నలుగురికి  పట్టా చేయాలనుకున్నడు. తండ్రి, ఓ సాక్షి, నలుగురం కలిసి టాటా ఏస్‌ కిరాయికి తీసుకుని 40 కిలోమీటర్ల దూరంలోని సుల్తానాబాద్‌ సబ్‌రిజి స్ట్రార్‌ ఆఫీసుకు పొయినం. బ్యాంకుల చలాన్‌ కట్టినం. పట్టా చేసే సార్‌ను కలిస్తే నలుగురు కదా టైం బడతదని చెప్పిండు. సాయంత్రం పట్టా చేసిండు. పొద్దంతా ఆడనే గడిసింది. రెండ్రోజుల తర్వాత మళ్లా సుల్తానాబాద్‌ వెళ్లి పత్రాలు తీసుకుని జమాబందీ కోసం ఎమ్మార్వో ఆఫీసుకు పొయినం. ఏడాది తిరిగితే అన్నదమ్ములకు జమాబందీ చేసిన్రు. ఈ పద్ధతి బాగాలేదు. సీఎం సార్‌ ధరణి తెచ్చి మంచి పనిజేసిండు. చిన్న తమ్ముడి 26 గుంటల భూమిని ఆరునెలల కిందట కొన్న. మొన్న పట్టా కోసం ధర్మారం మీసేవలో స్లాట్‌బుక్‌ చేసుకున్న. తాసిల్‌ ఆఫీస్‌కు మా తమ్ముడు, ఇద్దరు సాక్షులం కలిసి పొయినం. మా తమ్ముడి పట్టాబుక్‌, పహాణిల సర్వేనంబర్‌ను చూసిన తాసిల్దార్‌ 10 నిమిషాల్నే పట్టా కాయితాలు చేతిల పెట్టిండు. ఇంత జల్ది భూమి పట్టా అయితదని అనుకోలె. రైతులకు తక్లీఫ్‌ లేకుండా  సీఎం సారు మంచి కానూన్‌ తెచ్చిండు. 

- రైతు భూక్యా వాల్యానాయక్‌