బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:32:26

అగ్గువకే కూరగాయలు

అగ్గువకే కూరగాయలు

గతేడాదితో పోలిస్తే తగ్గిన ధరలు 

  • కాళేశ్వర జలాలతో పెరిగిన సాగు
  • దళారులకు చెక్‌.. నేరుగా విక్రయాలు 

ప్రతి వేసవిలో ‘కొండెక్కిన ధరలు.. భగ్గుమంటున్న కూరగాయలు..’ వంటివి వినిపించేవి. ఇప్పుడు    వాటికి తావులేకుండా కూరగాయలు అగ్గువకే దొరుకుతున్నాయి. దళారుల ప్రమేయం లేదు. రైతులే నేరుగా పట్టణాలు, గ్రామాల్లో విక్రయిస్తున్నారు. వంద రూపాయలకే చేసంచినిండా కాయగూరలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌లోనూ ధరలు అదుపులో ఉన్నాయి.

నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే కూరగాయల ధరలు తగ్గాయి. ఒకటి రెండు కాదు.. దాదాపు అన్నిరకాల ధరలు క్షీణించాయి. లాక్‌డౌన్‌ వేళ 40 రోజులుగా అగ్గువకే కడుపు నింపుతున్నాయి. రూ.వందకే  వారం రోజులకు సరిపడా సంచి నిండుతున్నాయి. ఒకట్రెండు మాత్రమే అత్యధికంగా రూ.40 ధర పలుకుతుండగా మిగతావి కిలో రూ.10, 20కే లభిస్తున్నాయి. తాజా కూరగాయలు, ఆకుకూరలతోపాటు పుచ్చ, కర్బూజ, సపోటా, బొప్పాయి, నిమ్మ, బత్తాయి పండ్లు సైతం తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రావడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా రెట్టింపయ్యింది. గతంలో రైతులు తెచ్చే కూరగాయలను దళారులు సేకరించి వివిధ ప్రాంతాలకు పంపేవారు. స్థానికంగా కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ధరలు పెరిగేవి. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు నిలిచి రైతులే నేరుగా విక్రయిస్తున్నారు. కొందరు ఆర్డర్లపై అపార్ట్‌మెంట్లకు కూడా అందిస్తున్నారు. దీంతో ధరలు తగ్గినా రైతులకు నష్టంలేదు. మరోవైపు కృత్రిమ కొరత సృష్టించకుండా విజిలెన్స్‌, మార్కెటింగ్‌ అధికారులు గట్టి నిఘాపెట్టారు. ప్రతిషాపు వద్ద ధరల పట్టికలు ఏర్పాటుచేశారు. ధరల నియంత్రణ కమిటీ వేయడంతో ధరలు నియంత్రణలో ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ సమీపగ్రామాల నుంచి..

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ, టంకర, గాజులపేట, తాటికొండ, కాకర్లపాడు, నవాబ్‌పేట, కొత్తపేట, పెద్దధర్పల్లి గ్రామాల నుంచి 400 మంది రైతులు నిత్యం 500 క్వింటాళ్ల కూరగాయలను  జిల్లాకేంద్రం లోని ఆరు రైతు బజార్లకు చేర్చుతున్నారు. దీనికి ప్రభుత్వమే ఉచితంగా వాహనాలను ఏర్పాటుచేస్తున్నది. దీంతో వారు తక్కువ ధరకే విక్ర యిస్తుండటంతో వినియోగదారులుసైతం సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

రోజు రూ.1500 వరకు ఆదాయం

యాసంగిల సైతం వరదకాలువ నిండా కాళేశ్వరం నీళ్లు ఉండటంతో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. అరెకరంలో కూరగాయలు వేసిన. రోజుకు రూ.1000 నుంచి రూ.1500 దాకా ఆదాయం వస్తున్నది. కూరగాయలు లాభసాటిగా ఉండటంతో వరికోశాక మరో అరెకరంలా బెండ, బీర, టమాట, మిర్చి, ఆనక్కాయ, కొత్తిమీర వేసిన. కూరగాయలు ఊళ్లనే అమ్ముతున్న. పేదోళ్లకు ఉట్టిగనే ఇస్తున్న.

-  దుర్గయ్య, బూరుగుపల్లి గ్రామం, గంగాధర, కరీంనగర్‌ 

చేను వద్దకే వచ్చి కొంటున్నరు

కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉంటున్నరు. కూరగాయల అమ్మకాలు బాగా జరుగుతున్నయి. ప్రజ లు చేను వద్దకే వచ్చి కొంటున్నరు. పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటవుతున్నది.

- చీకటి నాగమ్మ , కల్వల, మహబూబాబాద్‌ జిల్లా 

బేరగాల్లకు పోస్తే ఏమొస్తది..?

ఈసారి అన్ని పంటలు బాగానే పండినయి. దోసకాయ పది గుంటలు, టమాట పది గుంటలు ఏసిన. ఎక్కువ, తక్కు వ ఏస్తే బేరగాల్లకే పొయ్యాలే. ఆళ్లకు బోస్తె ఏముంటది. ఇటు నేను బాగుపడ్డట్టు ఉండదు.. తినేటోళ్లు సుత సంతోషపడ్డట్టు ఉండదు. గిప్పుడు పనులు గూడ లేవు. అందుకే బేరగాళ్లకు పోస్తలే. రోజు పొద్దుగాల వచ్చి మార్కెట్‌కు తీసుకొచ్చి నేనే అమ్ముకుంటున్న. రోజు చేతిల పైసలాడుతున్నయి. 

- యాస లక్ష్మమ్మ, మేల్ల దుప్పలపల్లి, నల్లగొండ 


logo