గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:32:34

హైదరాబాద్‌ దుర్భేద్యం

హైదరాబాద్‌ దుర్భేద్యం

  • 10 లక్షల కెమెరాలతో నిఘా  
  • ప్రజలు గుమికూడే ప్రతిచోట ఉండాలి
  • శాంతి భద్రతల నిర్వహణలో అవే కీలకం
  • సురక్షిత నగరమే లక్ష్యంగా పనిచేయాలి
  • సైబర్‌ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి
  • అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు
  • పోలీస్‌, పురపాలక అధికారులతో భేటీ
  • సీసీ కెమెరాలతో సిటీలో తగ్గిన నేరాలు
  • రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ

హైదరాబాద్‌: నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ను మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల సంఖ్యను 10 లక్షలకు పెంచాలని సూచించారు. హోంమంత్రి మహమూద్‌అలీతో కలిసి మంత్రి కేటీఆర్‌ పోలీస్‌, పురపాలకశాఖ అధికారులతో సోమవారం సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు 5.80 లక్షల సీసీ కెమెరాలకు తోడుగా మరిన్ని ఇన్‌స్టాల్‌ చేయాలని పోలీసులకు సూచించారు. సీసీ కెమెరాల సంఖ్యను పది లక్షలకు పెంచాలని చెప్పారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌.. ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నట్టు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిందని మంత్రి ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని,  ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఆరేండ్లుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు రావడంతోపాటు పట్టణీకరణలో భాగంగా నగరం విస్తరిస్తున్నందున నిఘా మరింత పెంచాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. 

అవసరమైన అన్ని చోట్లా సీసీకెమెరాలు

పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్‌ మరింత విస్తరిస్తున్నందున నగర శివార్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంలో సమన్వయంతో పనిచేయాలని పురపాలక, పోలీసుశాఖలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కులు, చెరువుల పరిసరాలతోపాటు, బస్తీ దవాఖానలు, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటివాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకొనే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమికూడే ప్రతిచోట సీసీ కెమెరాల నిఘా ఉండాలని చెప్పారు. అ దిశగా మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మరింత సురక్షితంగా మారగలదన్న విశ్వాసాన్ని కేటీఆర్‌ వ్యక్తంచేశారు. త్వరలో తీసుకురానున్న నూతన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చట్టాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నదా? అని పోలీసు అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యలకు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా పోలీస్‌శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

సైబర్‌ క్రైంపై మరింత ఫోకస్‌

కొవిడ్‌ పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెద్దఎత్తున నమోదవుతున్న సైబర్‌ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్‌క్రైమ్‌ సిబ్బందితోపాటు సైబర్‌వారియర్స్‌ను పోలీస్‌శాఖ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ సూచించారు. నగరంలో శాంతిభద్రతల నిర్వహణపై దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ పోలీసులకు వచ్చిన ప్రశంసలను ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి కేటీఆర్‌ సూచించిన విధంగా పది లక్షల సీసీ కెమెరాలను ఇన్‌స్టాల్‌  చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతమైందని, తద్వారా శాంతిభద్రతల నిర్వహణ పకడ్బందీగా మారిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, నేరస్థులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకునేందుకు అవి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ అవసరాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ, పోలీస్‌శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి అన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌,  డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


logo