గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 02:34:14

ప్రమాద మరణాలు తగ్గిద్దాం

ప్రమాద మరణాలు తగ్గిద్దాం

  • గోల్డెన్‌ అవర్‌కు.. యూనిఫైడ్‌ యాక్షన్‌ ప్లాన్‌
  • రోడ్లు, అంబులెన్స్‌, దవాఖానల మ్యాపింగ్‌ 
  • పూర్తి సమాచారంతో మొబైల్‌ యాప్‌ రూపకల్పన 
  • క్షతగాత్రుల తరలింపులో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలి. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరుగకుండా చూడాలి. ఇందుకోసం అన్నిశాఖల సమన్వయంతో అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ప్రమాదాలబారిన పడి రణించకూడదు.

- సమీక్షల్లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకోసం వేగ నియంత్రణ చర్యలను పటిష్ఠంగా అమలుచేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు, వేగనియంత్రణ పరికరాలను అమర్చింది. నిర్ణీత వేగ పరిమితి దాటి వెళ్తున్న, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా వెళ్లే వాహనాలను గుర్తించి అధికారులు భారీగా చలాన్లు విధిస్తున్నారు. ఇదే సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టాన్ని నివారించడంపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రహదారులు, అంబులెన్స్‌లు, ట్రామాకేర్‌ సెంటర్లు, దవాఖానలను అనుసంధానం చేస్తూ యూనిఫైడ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం రోడ్లుభవనాలు, రవాణ, వైద్య, పోలీస్‌ అధికారుల సమన్వయంతో  దీని రూపకల్పనకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం పనిచేస్తున్నది. పోలీసుశాఖ సహకారంతో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక యాప్‌ ను రూపొందిస్తున్నది. ఈ యాప్‌ను ఎవరైనా తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రమాదం జరిగిన చోటునుంచి దవాఖాన, ట్రామాకేర్‌ సెంటర్‌ ఎంతదూరంలో ఉన్నది? అంబులె న్స్‌ ఎంత సమయంలో చేరుకుంటుంది? ఎలా వెళ్లాలి అనే వివరాలను ఈ యాప్‌లో పొందుపరుస్తారు.

సమగ్ర వివరాలతో మ్యాపింగ్‌

ప్రమాదం జరిగిన అరగంటలో క్షతగాత్రుడిని దవాఖానకు తీసుకెళ్తే ప్రాణం కాపాడవచ్చు. వైద్య పరిభాషలో ఈ ఆరగంట సమయాన్ని ‘గోల్డెన్‌ అవర్‌' అంటారు. రాష్ట్రంలో ఏప్రాంతంలో ప్రమాదం జరిగినా క్షతగాత్రుడిని తక్షణమే సమీపంలోని దవాఖాన, ట్రామాకేర్‌ సెంటర్‌కు తరలించి  వైద్యమందించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 24,245 కిలోమీటర్ల రహదారులున్నాయి. ఇందులో 2,592 కిలోమీటర్ల 16 నేషనల్‌ హైవేలు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. ఈ రహదారులన్నీ జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాలను కలుపుతూ వెళ్తాయి. ఈ రోడ్‌ నెట్‌వర్క్‌తోపాటు, ట్రామాకేర్‌ సెంటర్లు, దవాఖానలు అన్నింటిపీ కలిపి నెట్‌వర్క్‌ రూపొందిస్తారు. ఇందులో ఏ ప్రాంతానికి ఏ దవాఖాన, ఏట్రామా కేర్‌సెంటర్‌ అందుబాటులో ఉన్నదో తెలుపుతుంది. 

రక్తస్రావ నియంత్రణపై శిక్షణ!

ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రుడికి తీవ్ర రక్తస్రావం అవుతుంది. దానిని నియంత్రించడంద్వారా 90శాతం మరణాలను అరికట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు ఈఎంఆర్‌ఐ ద్వారా మాస్టర్‌ ట్రైనర్స్‌ను గుర్తించాలని వైద్యశాఖ అధికారులను ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మాస్టర్‌ ట్రైనర్స్‌ ద్వారా అన్నిజిల్లాలు, మండలకేంద్రాల్లోనూ విస్త్రతంగా శిక్షణ ఇప్పిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ట్రామాకేర్‌ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లు, అంబులెన్స్‌ సిబ్బంది, డ్రైవర్లకు నిమ్స్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ద్వారా త్వరలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. logo