సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 02:03:57

వైరస్‌ సోకినా.. కోలుకోవచ్చు!

వైరస్‌ సోకినా.. కోలుకోవచ్చు!
  • నేనే దానికి ఉదాహరణ
  • ఇంటి వద్దే ఉండే విశ్రాంతి తీసుకోండి
  • స్వీయ చికిత్సతో కోలుకున్న
  • అమెరికా మహిళ సూచన

వాషింగ్టన్‌: కరోనా సోకితే భయపడవద్దని, ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలని స్వీయ చికిత్సతో కోలుకున్న అమెరికా మహిళ సూచించారు. ప్రమాదకర లక్షణాలు లేకపోతే సాధారణ ఫ్లూ మందులతో కరోనా నుంచి బయటపడవచ్చని తెలిపారు. వాషింగ్టన్‌లోని సియాటెల్‌కు చెందిన ఎలిజబెత్‌ స్కేదర్‌ (37) ఓ బయోఇంజినీరింగ్‌ సంస్థలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వారాంతపు పార్టీలో పాల్గొన్న ఆమెకు ఫిబ్రవరి 25న ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. మధ్యాహ్నానికి తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో పని చేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి తిరిగొచ్చారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చూస్తే జ్వరం 103 డిగ్రీలకు పెరిగింది. దీంతో వైద్యులను సంప్రదించి వారి సూచనతో ఫ్లూ నివారణ మందులు వేసుకున్నారు.   


మూడ్రోజుల్లో జ్వరం తగ్గుముఖం పట్టింది. దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు లేకపోవడంతో తనకు కరోనా సోకలేదని భావించారు. అయితే ఆమె పాల్గొన్న పార్టీలో మరికొందరికి తనలాంటి లక్షణాలున్నట్లు ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకున్నారు. ఎందుకైనా మంచిదని పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసిన ఎలిజబెత్‌ నివ్వెరపోగా ఆమె తల్లి ఆందోళన చెందారు. మరోవైపు వారం పాటు ఇంటి వద్దే ఉండాలని స్థానిక ఆరోగ్య అధికారులు ఎలిజబెత్‌కు సూచించారు. ఆ మేరకు ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని టీవీలో నచ్చిన కార్యక్రమాలు చూస్తూ కరోనా నుంచి బయటపడ్డారు.


logo