ప్రైవేట్ బ్యాంకర్ల వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

- కొడుకు చేసిన అప్పు కట్టాలని తండ్రిపై తీవ్ర ఒత్తిడి
- సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం
కాసిపేట: ప్రైవేట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ ఉద్యోగుల వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. కొడుకు తీసుకున్న రుణాన్ని కట్టాలంటూ తండ్రిపై ఒత్తిడి పెంచడంతో చేసేదేమీ లేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్ పంచాయతీలోని నగరం గ్రామానికి చెందిన టీ భాస్కర్(51) అనే రైతు గురువారం తెల్లవారుజామున నగరం గ్రామ శివారులోని తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. తన చావుకు గల కారణాలను సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘నా కొడుకు వెంకటేశ్ ఏడు లారీలను ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా లారీలు సక్రమంగా నడవకపోవడంతో నెలవారీ వాయిదాలు రూ.12 లక్షలు కట్టలేదు. దీంతో వాహనాలను సదరు బ్యాంక్, ఫైనాన్స్ నిర్వాహకులు తీసుకువెళ్లారు. అంతటితో ఆగకుండా రోజూ ఇంటికి వస్తూ నీ కొడుకే కదా.. డబ్బులు కట్టాలంటూ తీవ్రంగా వేధించారు. సమయం ఇవ్వాలని కోరినా నిన్ను, నీ కుటుంబాన్ని బజారుకీడుస్తామని అవమానించారు. అందుకే చనిపోతున్నా. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు బతకాలని ఉన్నా.. నన్ను చంపారు. నా చావుకు కారణమైన ఓ బ్యాంక్ మేనేజర్ హరీశ్, నిర్వాహకులు సతీశ్, రాకేశ్, ఫైనాన్స్ ఉద్యోగులు శ్రీధర్, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలి’. అని సూసైడ్ నోట్లో రాశారు. తన షర్ట్‌పై కూడా ఇదే రాశాడు. భాస్కర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మండలంలో సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దేవాపూర్ ఎస్సై దేవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం