శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:15:13

ఆసిఫాబాద్‌ @ 45.6 డిగ్రీలు

ఆసిఫాబాద్‌ @ 45.6 డిగ్రీలు

  • ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు వర్షాలు
  • కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓ వైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు ఆవర్తనం, అల్పపీడ ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది మరింత బలపడి సుమారుగా 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నది. ఆ తరువాత 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారి వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపారు. వీటి ప్రభావంతో ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కాగా వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. 

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 45.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉద యం 9 గంటలకే 39 డిగ్రీలు నమోదవుతుండటంతో ఇక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా కరీంనగర్‌ జిల్లాలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43.3, నిజామాబాద్‌లో 43, మెదక్‌లో 41.9, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు మరణించారు.

రోడ్డెక్కిన అడవి దున్నలు

ఎండలు మండిపోతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవి జంతువులు నీటి జాడను వెతుక్కుంటూ రోడ్డుపైకి వస్తున్నాయి. ఆదివారం కరకగూడెం మండలం మోతే-పద్మాపురం గ్రామాల మధ్య రహదారిపై వెళ్తున్న అడవి దున్నలను చూసిన వారు ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.  

- కరకగూడెం


logo