గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:32:16

కొండపోచమ్మ మట్టిపనిలో రికార్డు

కొండపోచమ్మ మట్టిపనిలో రికార్డు
  • ఏడు నెలల్లో 3.88 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి
  • తక్కువ వ్యవధిలోనే 12.17 కోట్ల క్యూ.మీ. రివిట్‌మెంట్‌ పనులు
  • ఏడాదిలో అందుబాటులోకి వచ్చిన రెండు పంపుహౌజ్‌లు
  • కాళేశ్వరం నాలుగో లింకులోనూ రికార్డుల మోత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులపై రికార్డులను నమోదుచేస్తున్నది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులోని రెండు లింకులతోపాటు తాజాగా అందుబాటులోకి రానున్న శ్రీరాజరాజేశ్వర జలాశయం- కొండపోచమ్మ సాగర్‌ వరకు పనుల్లో కూడా మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఈ నెల 15 లోగా కొండపోచమ్మలోకి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో పనులు చేపట్టడంతో ఏడు నెలల వ్యవధిలోనే 3.88 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనిని పూర్తిచేయడమనేది అరుదైన అంశం. కొండపోచమ్మ పూర్తి నిల్వసామర్థ్యం 15 టీఎంసీలు. ఈ జలాశయ నిర్మాణం ఏడు నెలల్లోనే పూర్తవడమం టే మాటలు కాదు. భూసేకరణకే దశాబ్దాల సమ యం గడిపిన అనుభవాల నుంచి నెలల వ్యవధిలో ఏకంగా నీటినిల్వకు జలాశయాలు సిద్ధం కావడమనేది సీఎం కేసీఆర్‌ కార్యదక్షతకు నిదర్శనం. 


ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌

సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకచోట విజయవంతమైన నిర్మాణాలను మరోచోట చేపట్టడం సులువు. కానీ ఆసియాలోనే తొలిసారిగా ఒక వినూత్న నిర్మాణాన్ని చేపట్టడమనే సవాళ్లను అధిగమించిన కాళేశ్వరం.. లింక్‌-4లోనూ మరో రికార్డును నమోదుచేసింది. ఎస్సారార్‌ నుంచి జలాలను అప్రోచ్‌ చానెల్‌ ఆపై 9.5 మీటర్ల వ్యాసంతో 7.651 కిలోమీటర్ల టన్నెల్‌ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి సర్జ్‌పూల్‌కి తరలిస్తారు. ఆ తర్వా త అక్కడి 106 మెగావాట్ల నాలుగు మోటర్ల ద్వారా సుమారు 11వేల క్యూసెక్కులకు పైగా నీటిని అన్నపూర్ణ జలాశయంలో పోస్తారు. ఇందు లో భాగంగా సర్జ్‌పూల్‌ను దేశంలోనే తొలిసారిగా వృత్తాకారంలో నిర్మించారు. దీని డయా 56 మీటర్లు.. లోతు ఏకంగా 92 మీటర్లు. ఇప్పటివరకు దేశంలో ఉత్తరాఖండ్‌ తెహ్రీ ప్రాజెక్టులో 38 మీటర్ల డయా, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ ప్రాజెక్టు లో 32 మీటర్ల డయా సర్జ్‌పూల్స్‌ పెద్దవి అని అధికారులు తెలిపారు.


తక్కువ సమయంలో ఎత్తిపోతకు సిద్ధం

ఎస్సారార్‌ నుంచి కొండపోచమ్మకు ఒక్క టీఎంసీ జలాల తరలింపునకు ఐదుదశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. మొదటగా అన్నపూర్ణ పంపుహౌజ్‌ (తిప్పాపూర్‌)లో 106 మెగావాట్ల నాలుగు మోటర్లను సిద్ధంచేశారు. అన్నపూర్ణ జలాశయం నుంచి రంగసాయకసాగర్‌లోకి తరలించేందుకు చంద్లాపూర్‌ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌లో 134 మెగావాట్ల నాలుగు మోటర్లు, ఆ తర్వాత మల్లన్నసాగర్‌లోకి జలాలను తరలించేందుకు తుక్కాపూర్‌ వద్ద పంప్‌హౌజ్‌లో 43 మెగావాట్లతో ఎనిమిది మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మల్లన్నసాగర్‌ పూర్తి కానందున ఫీడర్‌ చానెల్‌ ద్వారా అక్కా రం పంప్‌హౌజ్‌కు తరలిస్తారు. ఇక్కడినుంచి 27 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు మోటర్ల ద్వారా మర్కూక్‌ పంప్‌హౌజ్‌లోకి జలాలను తరలిస్తారు. కొండపోచమ్మలోకి ఎత్తిపోసేందుకు ఇక్కడ 34 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు మోటర్లను సిద్ధంచేశారు.


ముందుచూపుతో ఫీడర్‌ చానెల్‌

ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో  ఏదైనా ఆలస్యమైతే ప్రాజెక్టు పని మొత్తం నత్తనడకన సాగేది. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం అనుక్షణం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తుండటంతో మధ్యలో ఏదైనా నిర్మాణం ఆలస్యమైతదనుకొంటే వెంటనే ప్రత్యామ్నాయ మార్గంలో జలాలను ముందుకు తీసుకుపోయి రైతులకు ఫలాలను అందించాలనే తపన ప్రదర్శించారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ అందుబాటులోకి వచ్చేందుకు కొం త సమయం పడుతున్నది. అనంతరం ఉన్న కీలకమైన కొండపోచమ్మ సాగర్‌ నిర్మాణం పూర్తయింది. అందుకే మల్లన్నసాగర్‌ పూర్తయ్యే వరకు రైతులు ఎదురుచూడకుండా దానిని బైపాస్‌చేసి గోదావరి జలాలను తరలించేందుకు ముందుచూపుతో ఫీడర్‌ చానెల్‌ నిర్మాణానికి ఆదేశించారు. 18.5 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండటంతో గోదారమ్మ కొండపోచమ్మను చేరనున్నది.


కాళేశ్వరం లింక్‌-4(ఎస్సారార్‌- కొండపోచమ్మ వరకు)

ఆయకట్టు - 5,89,280 ఎకరాలు

రిజర్వాయర్ల  నిల్వ సామర్థ్యం- 71.5 టీఎంసీలు 

 అన్నపూర్ణ (3.5),  రంగనాయక (3), 

మల్లన్న (50), కొండపోచమ్మ (15 టీఎంసీలు)


టన్నెల్‌ పొడవు - 32.421 కిలోమీటర్లు

గ్రావిటీ కాల్వలు - 76.265 కిలోమీటర్లు

పంప్‌హౌజ్‌లు - ఐదు


కాలంతో పరుగులు పెట్టాం

ఎస్సారార్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌వరకు గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన పనుల పూర్తికి కాలంతో పరుగులు పెడుతున్నాం. సీఎం కేసీఆర్‌ ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండటంతో రికార్డు సమయంలో కొన్ని నిర్మాణాలను అందుబాటులోకి తేగలిగాం. ఈ నెల 15లోగా కొండపోచమ్మ సాగర్‌లోకి జలాలను తరలించాలనే లక్ష్యంతో ఉన్నాం. 

- హరిరాం, కాళేశ్వరం ఈఎన్సీ


రూ.1695.33 కోట్ల అంచనాతో చేపట్టిన కొండపోచమ్మ నిర్మాణ పనుల తీరిది.


పని రకం
కొలత ప్రమాణం
చేయాల్సిన పని
చేసిన పని
రిజర్వాయర్‌ గట్టు రీచ్‌-1
లక్షల క్యూ.మీ.ల్లో
244.50
244.50
రిజర్వాయర్‌ గట్టు రీచ్‌-2
లక్షల క్యూ.మీ.ల్లో
143.735
143.735
రివిట్‌మెంట్‌
లక్షల క్యూ.మీ.ల్లో
12.17
2.17logo
>>>>>>