సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 01:27:30

నిఘాలో మనమే మెగా

నిఘాలో మనమే మెగా

  • దేశంలో ఎక్కువ సీసీటీవీ కెమెరాలున్న నగరంగా గుర్తింపు
  • ప్రపంచంలోని టాప్‌ 
  • 20 నగరాల్లో మనకు 16 స్థానం
  • ప్రతి వెయ్యిమంది జనాభాకు 29.99 సీసీటీవీలు
  • వెల్లడించిన కంపారిటెక్‌ సంస్థ వార్షిక నివేదిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మరో ఘనతను సాధించింది. నేరాల పరిశోధన, కట్టడిలో అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ (క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్‌) కెమెరాల బిగింపులో అరుదైన గుర్తింపును పొందింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాలున్న టాప్‌ 20 నగరాల్లో చోటు సంపాదించింది. ప్రతి వెయ్యిమంది జనాభాకు సీసీటీవీల ఏర్పాటులో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌కు 16వ స్థానం దక్కిందని లండన్‌కు చెందిన కంపారిటెక్‌ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం వార్షిక నివేదికను విడుదలచేసింది. కంపారిటెక్‌ సంస్థ వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌), యాంటీ వైరస్‌, యాప్స్‌ వంటి సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన 150 నగరాలను పరిశోధించి సీసీటీవీ కెమెరాల బిగింపుపై నివేదికను రూపొందించింది. దీనిలో హైదరాబాద్‌ 16వ స్థానంలో ఉండగా, చెన్నైకి 21వ స్థానం, ఢిల్లీకి 33 స్థానం దక్కాయి. మరోవైపు, దీనిపై సంతోషం వ్యక్తంచేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఈ నివేదికను ట్విట్టర్‌లో షేర్‌చేశారు. పోలీసులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

20లో చైనావే 18

l సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే చైనా టాప్‌లో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 20 నగరాల్లో 18 చైనావే కావడం గమనార్హం. తైవాన్‌ నగరంలో 38,91,127 మంది జనాభాకు 4,65,255 సీసీటీవీ కెమెరాల బిగింపుతో ప్రపంచంలోనే నంబర్‌వన్‌ నగరంగా నిలిచింది. అంటే ప్రతి వెయ్యిమంది జనాభాకు 119.57 సీసీటీవీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి.

l టాప్‌ 20లో చైనా కాకుండా హైదరాబాద్‌ (16వ స్థానం), లండన్‌ (3వస్థానం) మాత్రమే ఉన్నాయి.

l హైదరాబాద్‌లో కోటి మందికిపైగా ఉన్న జనాభాకు 3 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అంటే ప్రతి వెయ్యిమందికి సరాసరిన 29.99 సీసీటీవీ కెమెరాలు బిగించారు.

l 2021 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్య ఒక బిలియన్‌ మించుతుందని అంచనాలు ఉన్నాయి. 

l ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 770 మిలియన్‌ కెమెరాలు వాడకంలో ఉండగా, వీటిలో 54 శాతం కెమెరాలు చైనాలో ఉన్నాయి. logo